ఏపీ పరిపాలనా రాజధాని విశాఖకు తరలిపోవడంఖాయమేనా!

Published: Saturday January 11, 2020
ఏపీ పరిపాలనా రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న జగన్‌ ప్రభుత్వం.. కేబినెట్‌ సమావేశాన్ని, ప్రత్యేక ఉమ్మడి అసెంబ్లీ సమావేశం తేదీలను మాత్రం ఇంకా ఖరారుచేయలేదు. 18న గానీ, 20న గానీ ప్రత్యేక అసెంబ్లీ భేటీ ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బోస్టన్‌ గ్రూపు నివేదికలోని సారాంశాన్ని అనుసరించి.. రాజధానిని విశాఖకు తరలించేలా హైపవర్‌ కమిటీ నివేదికను సిద్ధం చేస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు.. విశాఖలో పరిపాలనా రాజధాని సచివాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేగంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో 18న మంత్రివర్గం.. అదే రోజున ఉమ్మడి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
 
 
విశాఖకు సచివాలయం తరలిపోవడం ఖాయమని తేలిపోయాక.. కొందరు హెచ్‌వోడీలు.. తమ నివాసం, కార్యాలయం కోసం భవనాలనూ వెతుక్కోవడం ప్రారంభించారు. ఇలాంటి తరుణంలోనే సంక్రాంతికి 15న సెలవు ఉంది. 16న ఐచ్ఛిక సెలవు. 17న సెలవు పెడితే.. 18న వారాంతపు సెలవు వస్తోంది. 19న ఆదివారం. వరుస సెలవులు రావడంతో.. 16న ఐచ్ఛిక సెలవు పెట్టిన సచివాలయ ఉద్యోగులు.. 17న సెలవు కోసం దరఖాస్తు చేశారు. వారందరికీ శాఖాధిపతులు సెలవులు కూడా మంజూరు చేశారు. కానీ శుక్రవారం ఆకస్మికంగా.. 17, 18వ తేదీల్లో ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని శాఖాధిపతుల పేరిట సర్క్యులర్‌ జారీ అయింది. 16న ఐచ్ఛిక, 17న సెలవుల కోసం చేసిన దరఖాస్తులను రద్దు చేశామని స్పష్టం చేశారు. దీంతో రాజధాని నగరం విశాఖకు మార్పుపై 17, 18 తేదీలు కీలకం కానున్నాయన్న ప్రచారం జోరందుకుంది.