భద్రత గాలికి వదిలిన ఎస్పీవై ఆగ్రోస్‌

Published: Monday June 29, 2020

నంద్యాల ఎస్పీవై ఆగ్రో సంస్థలో జరిగిన విస్పోటనంపై విచారణ జరిగే కొద్దీ ఆ ఫ్యాక్టరీలో లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఫ్యాక్టరీ నిర్వహణకు, ప్రమాదరకమైన గ్యాస్‌ నిల్వలకు ఆ సంస్థ యాజమాన్యం  అనుమతులు తీసుకోలేదని స్పష్టమవుతోంది. సమస్యను గుర్తించాల్సిన పరిశ్రమల శాఖ అధికారులు తమకేమీ తెలీదని చెబుతున్నారు. అసలు విచారణే చేయలేదని, మరోసారి వెళ్లినపుడు ఏమైందో చెప్తామని అంటున్నారు. ఒక నిండు ప్రాణం బలైంది. పచ్చటి కుటుంబం రోడ్డుపై పడింది. అయినా అధికారుల్లో చలనం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల నోళ్లు నొక్కేందుకు కొన్ని రాజకీయ శక్తులు బలంగా పనిచేస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

 

ప్రమాదం జరిగిన రోజే పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ, అగ్రిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలిని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో కొంత విలువైన సమాచారాన్ని సేకరించారు. సుమారు 20 రోజుల క్రితమే ఫ్యాక్టరీలోని లోపాలను గుర్తించి పలు శాఖాధికారులు షోకాజ్‌ నోటీసులను జారీ చేసినా యాజమాన్యంలో ఏమాత్రం మార్పు లేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజు కూడా త్వరలో అనుమతులు తీసుకుంటామని, భద్రత ఏర్పాట్లు చేసుకుంటామని యాజమాన్యం ప్రకటించిందని కొందరు జిల్లా స్థాయి అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అనుమతుల్లేకుండానే ఫ్యాక్టరీలో తిరిగి పనులు ప్రారంభిస్తారని స్థానికులు, రైతు, ప్రజా సంఘాలు అంటున్నాయి. 

 

ఎస్పీవై ఆగ్రో సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజీవ్‌ సేఫ్టీ ఆథారిటీ (పీఈఎస్‌వో) నుంచి లైసెన్స్‌ పొందలేదు. ప్రమాదకరమైన గ్యాస్‌, పెట్రోల్‌ను ఎక్కువ మోతాదులో నిల్వ చేసుకోవడానికి తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి. కానీ యాజమాన్యం నిబంధనలను తుంగలో తొక్కింది. భారీ పరిశ్రమలు, గ్యాస్‌, పెట్రో ఆధారిత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజీవ్‌ సేఫ్టీ ఆథారిటీ (పీఈఎస్‌వో ) నుంచి లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది. కానీ పరిశ్రమల శాఖ అధికారులెవ్వరూ ఎక్స్‌ప్లోజీవ్‌ లైసెన్స్‌ల విషయం గురించి ఆగ్రో యాజమాన్యం వద్ద ప్రస్థావించడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 

అనుమతుల వ్యవహారంపై తాము దృష్టి పెట్టలేదని, విచారణకు సోమవారం వెళ్లినపుడు పరిశీలిస్తామని పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణారెడ్డి అన్నారు. ఏం జరిగిందనేది విచారణ కమిటీ తేలుస్తుందని వ్యాఖ్యానించారు. పరిశ్రమలో లోపాలు, సమస్యల గురించి చెప్పడానికి నిరాకరించారు. పీఈఎస్‌వో అనుమతులు లేకుండా నడుస్తున్న ఫ్యాక్టరీకి భారీ మొత్తంలో అమోనియా గ్యాస్‌ను ఓ సంస్థ సరఫరా చేసింది. ఆ సంస్థ కూడా ప్రమాదానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, శిక్షకు కూడా  ఆ సంస్థ నిర్వాహకులు అర్హులేనని తెలుస్తోంది.