ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు?

Published: Friday July 03, 2020

‘కోర్టులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటే.. ప్రభుత్వమెందుకు.. ప్రజలెందుకు.. ఎన్నికలెందుకు..’ అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. కుటుంబ సమేతంగా గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని, కాణిపాకం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయా చోట్ల మీడియాతో మాట్లాడారు. ‘à°ˆ విధంగా చేయి.. నువ్విక్కడకు వెళ్లు.. ఇది స్టాప్‌ చేయి.. అని చెబుతుంటూ ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ఓట్లెందుకు... ఎమ్మెల్యేలెందుకు? పార్లమెంటు సిస్టం ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభ నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? స్పీకర్లు ఎందుకు? ఇవన్నీ దేనికి? మీరే (హైకోర్టు) అక్కడి నుంచి రూల్‌ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా? భారత రాజ్యాంగం మనకు స్పష్టమైన వ్యవస్థలనిచ్చింది.

 

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను నిర్ణయించారు..ఒకరి పరిధులను మరొకరు అతిక్రమించకుండా.. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి. అధికారాలు, హక్కులతో పాటు హద్దులనూ నిర్ణయించింది. మరి కోర్టుల నుంచే ఆదేశాలు వస్తే.. ప్రభుత్వ పాలసీల్లో కోర్టులే జోక్యం చేసుకుంటే.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలెందుకు? ప్రజలు ఎన్నుకోవడం దేనికి? ప్రభుత్వాన్ని న్యాయస్థానాలే నడిపిస్తాయా..? కోర్టుల నుంచే పరిపాలన సాగిస్తారా..? ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే. బాధతోనే కోర్టు తీర్పులను అంగీకరిస్తున్నాం. మేధావులు దీనిపై చర్చించాలి.

 

50 ఏళ్లుగా చూడని వింత పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మా నిర్ణయాలు తప్పయితే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు. ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలు అడ్డుకోవడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ఠ’ అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగి ఉంటే నిరూపించాలని స్పీకర్‌ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు