భారీ సంఖ్యలో చేపల మృతి.. ఆందోళనలో ఆక్వా రైతులు

Published: Saturday October 31, 2020

విశాఖ జిల్లా పరవాడ మండలంలోని రాంకీ ఫార్మా సిటీ(జేఎన్‌పీసీ) నుంచి వెలువడే కాలుష్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారింది. అందులోని కంపెనీలు వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా బయటకు విడిచి పెడుతుండడంతో అవి గెడ్డల ద్వారా చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో కలిసి మత్స్య సంపదను నాశనం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో చేపలు భారీసంఖ్యలో మృత్యువాతపడ్డాయి. ఫార్మాసిటీలో సుమారు 76 కంపెనీలు ఉన్నాయి. వాస్తవానికి ఫార్మా కంపెనీలు వ్యర్థాలను రాంకీ సంస్థకు అప్పగించి శుద్ధి చేయించాలి. ఇందుకుగాను ఆయా కంపెనీలు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. పలు ఫార్మా కంపెనీలు వ్యర్థాలను నేరుగా బయటకు వదిలేస్తున్నాయి. అవి అక్కడ నుంచి గెడ్డలు, ఊరచెరువు ద్వారా పరవాడ పెద్ద చెరువులో కలుస్తున్నాయి. దీంతో అందులో రైతులు పెంచుతున్న చేపలు భారీ సంఖ్యలో మృతి చెందాయి. 

 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ, ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు అప్పలనాయుడు, వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పెద్ద చెరువులో చనిపోయిన చేపలను వీరంతా పరిశీలించారు. సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, డిప్యూటీ తహసీల్దార్‌ వరహాలు, పరవాడ ఇన్‌చార్జి సీఐ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ రామారావు, వీఆర్‌వో తదితరులు పెద్ద చెరువును సందర్శించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.