కొత్త జిల్లాల ఏర్పాటులో ఇదే కీలకం

Published: Thursday November 05, 2020
జిల్లాల పునర్విభజన ప్రక్రియలో కీలక కసరత్తు మొదలైంది. పెద్ద రెవెన్యూ డివిజన్లు, మండలాలను గుర్తించి వాటిని పునర్‌వ్యవస్థీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. పరిపాలనా సౌలభ్యంతోపాటు కొత్త జిల్లా ల్లో సరిహద్దు, ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు పెద్ద డివిజన్లు, మండలాల పునర్విభజనపై దృష్టిసారించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. జిల్లాల సరిహద్దుపై ఏర్పాటైన సబ్‌ కమిటీ-1 కూడా ఇదే అంశంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్రల్లో జిల్లాల విభజనకు అనుసరించిన విధానాలు, వాటి మ్యాప్‌లను కమిటీ పరిశీలిస్తోంది. జిల్లాల విభజనకు ముందే పెద్ద డివిజన్లు, మండలాలను పునర్విభజన చేయాలని, ఇందుకు రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై జిల్లాల వారీగా ఉన్న గ్రామాలు, మండలాలు, డివిజన్లు, వాటి విస్తీర్ణం, జనసాంద్రత, ఆస్తులు, భవనాలు, సాగు భూములు, ఇతర అంశాలపై సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం.

 

జిల్లాల పునర్విభజనకు ముందే పెద్ద డివిజన్లు, మండలాలను పునర్‌వ్యవస్థీకరించాలని రెవెన్యూశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కొత్త జిల్లాలపై కసరత్తుకు ఏర్పాటుచేసిన సబ్‌కమిటీ-1 కూడా ఇదే అంశంపై దృష్టి సారించింది. ‘పరిపాలనా సౌలభ్యం కోసం పెద్దవాటిని విభజించాలన్నది మొదటి నుంచి ఉంది. భవిష్యత్తులో ఎలాంటి సరిహద్దు, భౌగోళిక సమస్యలు రాకుండా ఉండేలా జిల్లాల ఏర్పాటు జరగాలంటే ముందుగా పలు నియోజకవర్గాల్లో కలిసి ఉన్న మండలాలు, డివిజన్లను విభజించాలి. దీని వల్ల అనేక అంశాల్లో స్పష్టత వస్తుంది. పరిపాలనా పరంగా ఏ ప్రాంతం ఎక్కడి వరకు ఉందన్నది తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది’’ అని రెవెన్యూశాఖ ఉన్నతాధికారి చెప్పారు