కరోనా టీకాపై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Published: Sunday November 08, 2020

కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకా త్వరలోనే వచ్చేస్తుందని, చాలా దేశాలు ఇప్పటికే తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు తుది పరీక్షలు నిర్వహిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరులో లేదంటే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్, కరోనా వైరస్ మేనేజ్‌మెంట్ జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చినా అది సామాన్యుల వరకు చేరేందుకు మరో ఏడాది పడుతుందని పేర్కొన్నారు. 2022 వరకు సామాన్యులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. 

 

 

కరోనా టీకా భారత మార్కెట్లోకి రావాలంటే ఏడాది కంటే ఎక్కువ సమయమే పడుతుందని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. ‘‘ఏడాది కంటే ఎక్కువ సమయమే పడుతుంది’’ అని à°“ ఇంటర్వ్యూలో గులేరియా స్పష్టం చేశారు. ఫ్లూ వ్యాక్సిన్‌లా కరోనా టీకాను ఎలా కొనుగోలు చేయవచ్చో చూసేందుకు తమకు కొంత సమయం కావాలని అన్నారు. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు ఏంటన్న ప్రశ్నకు గులేరియా మాట్లాడుతూ.. కోల్డ్ చైన్‌ను నిర్వహించడం, సరిపడా సిరంజిలు, సూదులు అందుబాటులో ఉంచడం, దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చేర్చడం వంటివి పెను సవాలుతో కూడుకున్నవని అన్నారు.

 

తొలి టీకా తర్వాత అందుబాటులోకి వచ్చే మరో టీకా సమర్థవంతంగా పనిచేస్తే దాని స్థానం ఏంటన్నది రెండో సవాలు అవుతుందని డాక్టర్ గులేరియా అన్నారు. అప్పుడు కోర్స్ కరెన్షన్ ఎలా అన్నది ప్రశ్నగా మారుతుందన్నారు. అప్పుడు తొలి టీకా ఎవరికి ఇవ్వాలి? రెండో టీకా ఎవరికి ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తుతుందన్నారు. కాబట్టి ఈ దిశగా ముందుకెళ్లే క్రమంలో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గులేరియా వివరించారు.