పురుగుల మందులు, రసాయనాలు అధిక వాడకమే వింత వ్యాధికి కారణమా ?

Published: Saturday December 12, 2020

ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలు దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే సీసం, నికెల్‌ ప్రభావం అత్యధికం ఉన్నట్లు చెబుతూనే ఆహారం, కూరగాయల్లో పాదరసం, పురుగు మం దుల అవశేషాలు ఉన్నట్టు పలు సంస్థలు ధ్రువీకరించాయి. వందలాది మంది అస్వస్థతకు గురి కావడానికి ఇదే కారణ మని పేర్కొన్నాయి. వాస్తవానికి ఒక్క తాగునీటిలోనే కలుషిత కారకాలు, భారలోహాలు ఉంటాయని ఊహించినప్పటికీ దీనికి భిన్నంగా ఆహార పదార్థాల్లోనూ పురుగు మందుల అవశేషాలు బయటపడటం దిగ్ర్భాంతికి గురిచేశాయి. ఇదే విషయం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ఎన్‌ఐఎన్‌) ప్రస్తావించింది. తినే అన్నంలో పాదరసం ఛాయలు కనిపిస్తున్నట్లు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం. అసలు ఇది ఎలా సాధ్యమని రకరకాలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి. జిల్లా వాసులు సోనామసూరి రకం బియ్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత స్వర్ణ, రేషన్‌ బియ్యాన్ని వాడతారు. ఇప్పుడు అన్నంలోనే పాదరసం ఛాయలు కనిపించడంతో.. ఇది ఏ రకం బియ్యంలోననే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలే కార్తీక మాసం. ఈ నెలలో చేపలు, మాంసంకంటే ఎక్కువ మంది కూరగాయలనే తీసుకుంటారు. ఈ సమయంలో వీటి ధరలు పెరుగుతాయి.  ప్రత్యేకించి టమాటా అసాధారణ స్థాయిలో వినియోగించారు. ఇపుడు కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు వున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అధిక దిగుబ డులు, చీడపీడల నుంచి పంటలను రక్షించుకునేందుకు కూరగాయల్లో ఎడాపెడా పురుగు మందులను పరిమితి లేకుండా వాడేస్తున్నారు. దీని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోకుండా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇపుడదే విష యం వింతరోగంలో బయటపడ్డాయి. నిషేధించిన పురుగు మందులను కూరగాయల పంటల్లో వాడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చిత్రం ఏమిటంటే రక్తనమూనాలు భారలోహాలు బయటపడగా ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నారు