విజయవాడలో మహాపాదయాత్ర

Published: Wednesday December 16, 2020

మూడు రాజధానులకు నిరసనగా రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి à°ˆ నెల 17à°•à°¿ 365 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి మంగళవారం విజయవాడలో మహాపాదయాత్ర నిర్వహించింది. రైతులు, మహిళలు, చిన్నారులు, యువకులు, న్యాయవాదులు, కార్మికులు, వృద్ధులు à°ˆ పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, కాంగ్రెస్‌ నేత నరహరశెట్టి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు రైతుల వేషధారణలో ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రులకు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని నినాదించారు. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక కళాకారులు ఆటపాటలతో హుషారు నింపారు. పడవల రేవు వంతెన నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద ముగిసింది. మహిళలు మానవహారం నిర్వహించి అమరావతి నినాదాలతో హోరెత్తించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి భూములిచ్చి, రాజధాని కోసం 364à°µ రోజులుగా రోడ్డెక్కి పోరాడుతున్నా, 105 మంది రైతులు దిగులుతో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటం చేస్తున్న తమను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని వాపోయారు. ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని’ నినాదంతో అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారానికి 364à°µ రోజుకు చేరింది. 29 గ్రామాల రైతులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అమరజీవి పోట్టి శ్రీరాములు స్ఫూర్తితో పోరాడతామని ప్రతిన బూనారు.  

రైతుల ఉద్యమానికి ప్రభుత్వం తలవంచి అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించక తప్పదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. అమరావతి కోసం 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగం à°’à°• చరిత్రని కొనియాడారు. రాజధాని రైతులు 364 రోజులుగా చేస్తున్న ఉద్యమం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోందన్నారు.