21 ఏళ్ల వరకు నో సిగరెట్..

Published: Saturday January 02, 2021

సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తుల అమ్మకానికి అనుమతించే వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం కొత్త బిల్లును రూపొందించింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రకటనలపై నిషేధం, వ్యాపార నియంత్రణ, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ) సవరణ చట్టం, 2020 పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ముసాయిదాను రూపొందించింది. కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో సిద్ధం చేస్తున్న కొత్త బిల్లులో భాగంగా వయో పరిమితిని 21 ఏళ్ల వరకు పెంచనున్నారు. ఈ మేరకు సిగరెట్లు, ఇతర పొకాకు ఉత్పత్తుల చట్టం, 2003కి సవరణ చేయనున్నారు. నూతన సవరణ బిల్లు ప్రకారం.. 21 ఏళ్ల లోపు వారికి ఎవరూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మడం, అమ్మేలా ప్రోత్సహించడం, విక్రయాలకు అనుమతించడం చేయకూడదు. విద్యా సంస్థలకు 100 మీటర్లలోపు కూడా ఇదే నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తారు. రెండోసారి మళ్లీ దోషిగా తేలితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారు.