విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేతకు ప్రయత్నిస్తాం

Published: Monday February 08, 2021

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని à°† పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.1330 కోట్లు కేటాయించారని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటు పరం విషయం కేంద్రం ప్రకటించేంత వరకు తమకు తెలియదన్నారు. ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.

 

ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ మాధవ్‌తోపాటు ఇతర పార్టీ నాయకులు కేంద్ర పెద్దలను కలిశారని, మరికొద్దిరోజుల్లో తామూ కలవబోతున్నామని చెప్పారు. విశాఖ ప్రజలతోపాటు రాష్ట్ర వాసులకూ స్టీల్‌ప్లాంట్‌తో ప్రత్యేక అనుబంధముందన్నారు. కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లోనూ అసాధారణ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడం లేదన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా కేంద్రం ఎంతో మేలు చేస్తోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై అగ్రిసెస్‌ విధించినంత మాత్రాన రేట్లు పెరగవని, à°† మేరకు కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తుందని చెప్పారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.