కార్పొరేషన్లలో విశాఖ టాప్‌

Published: Wednesday March 03, 2021

రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు à°ˆ నెల పదో తేదీన పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం మంగళవారం మొదలైంది. వీటిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం ద్వారా కైవసం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు వేసిన ‘స్కెచ్‌’ అమలుకు వైసీపీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది! శ్రీకాకుళం జిల్లా మొదలుకుని అనంతపురం జిల్లా వరకూ ప్రతి జిల్లాలోనూ నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంలో మంగళవారం ఇంచుమించు ఒకే తరహా దృశ్యాలు కనిపించాయి.

 

ప్రతిపక్షాల అభ్యర్థులకు బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలతో అత్యధిక నగరాలు, పట్టణాల్లో వారు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. రాష్ట్రంలోని ఎన్నికలు జరిగే మొత్తం 671 డివిజన్లు, 2,123 వార్డుల కోసం మొత్తం 17,415 మంది నామినేషన్లు వేయగా.. మంగళవారం ఏకంగా 2,502 మంది పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పలు జిల్లాల్లో డివిజన్లు, వార్డులు వైసీపీకి ఏకగ్రీవమవుతున్నాయి. విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 92 ఉపసంహరణలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. చిత్తూరు కార్పొరేషన్‌ (90), విజయనగరం (89), విజయవాడ (83) à°† తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉపసంహరణలకు చివరి రోజైన బుధవారం అధికార పార్టీ నేతలు.. అత్యధిక ప్రతిపక్ష అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింపజేయబోతున్నట్లు సమాచారం. తద్వారా.. ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సి‘పోల్స్‌’లోనూ వైసీపీ అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

13 జిల్లాల్లో తూర్పు గోదావరిలోనే అత్యధిక ఉపసంహరణలు జరిగాయి. జిల్లాలో మొత్తం 292 మంది అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. వీరిలో అత్యధికంగా మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మున్సిపాలిటీలో 61 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. విత్‌డ్రాయల్స్‌ తర్వాత à°ˆ జిల్లాలో ఇప్పటికే 22 వార్డులు ‘ఏకగ్రీవమై’ వైసీపీ ఖాతాల్లో పడ్డాయి. తునిలో 51 మంది, సామర్లకోటలో 44, అమలాపురంలో 40, మండపేటలో 36, రామచంద్రపురంలో 27, పిఠాపురం, గొల్లప్రోలుల్లో పదేసి మంది, ఏలేశ్వరంలో 7, ముమ్మిడివరంలో ముగ్గురు ఉపసంహరించుకున్నారు.

పరిపాలనా రాజధానిగా సీఎం ప్రకటించిన విశాఖ.. ఉపసంహరణల్లోనూ ముందంజలోనే ఉంది. జిల్లాలో మొత్తం 150 ఉపసంహరణలు చోటు చేసుకున్నాయి. విశాఖ మహా నగర పాలక సంస్థలో రాష్ట్రంలోనే అత్యధికంగా 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. నర్సీపట్నంలో 39 మంది, యలమంచిలిలో 16 మంది వైదొలిగారు.

 

అనంతపురం జిల్లాలో 274 ఉపసంహరణలు జరుగగా.. అనంతపురం కార్పొరేషన్‌లో 25 మంది, à°† జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో 249 మంది పోటీనుంచి వైదొలిగారు.

చిత్తూరు జిల్లాలో 233 మంది వైదొలగగా.. వారిలో అత్యధికంగా 90 మంది చిత్తూరు నగర పాలక సంస్థలో, 60 మంది తిరుపతి కార్పొరేషన్‌లో ఉన్నారు.

గుంటూరు జిల్లాలో 223 ఉపసంహరణలు చోటు చేసుకున్నాయి. గుంటూరు కార్పొరేషన్‌లో 33 విత్‌డ్రాయల్స్‌ జరిగాయి!

కర్నూలు జిల్లాలో 221 మంది పోటీ నుంచి వైదొలిగారు. కర్నూలు కార్పొరేషన్‌లో 22 మంది, నంద్యాలలో 41, ఎమ్మిగనూరులో 22, డోన్‌లో 46, నందికొట్కూరులో 12, ఆళ్లగడ్డలో 17, గూడూరులో నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

కృష్ణా జిల్లాల్లో 221 మంది అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. విజయవాడ నగర పాలక సంస్థలో ఏకంగా 83 ఉపసంహరణలు జరగడం గమనార్హం!