శాశ్వత భర్తీలు లేకుంటే విద్యపై ప్రభావం

Published: Wednesday March 10, 2021

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమిస్తూ పోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టకుండా ఏళ్ల తరబడి తాత్సారం వహించిన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేపట్టే నియామకాల్లో రాజ్యాంగం నిర్దేశించిన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు కావడంలేదని పేర్కొంది. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో బోధన, ఇతర సిబ్బంది నియామకం కోసం నూజివీడు ఆర్‌జీయూకేటీ రిజిస్ట్రార్‌ జనవరి 8న ఇచ్చిన నోటిఫికేషన్‌ అమలును నిలుపుదల చేసింది.

 

పిటిషనర్లను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశాలు జారీచేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను 4వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా.. తాజాగా కాంట్రాక్ట్‌ విధానంలో బోధనా సిబ్బంది నియామకానికి నూజివీడు ఆర్‌జేయూకేటీ రిజిస్ట్రార్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారంటూ కె గణేశ్‌రెడ్డి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాలను విచారించిన న్యాయమూర్తి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.