కొత్త వేతన కోడ్ అమలు వాయిదా

Published: Wednesday March 31, 2021

కొత్త లేబర్ కోడ్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇటీవల ప్రకటించిన నాలుగు లేబర్ కోడ్స్ అమలును మరికొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘కొత్త లేబర్ కోడ్స్‌ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్య పారిశ్రామిక రాష్ట్రాలైనా ఈ రూల్స్‌ను కేంద్రంతో పాటూ నోటిఫే చేస్తే బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. న్యాయపరమైన చిక్కులను లేకుండా చూడాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం’ అని కేంద్ర కార్మిక శాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాష్ట్రాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేసిన వెంటనే కేంద్రం వీటిని నోటిఫై చేస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకూ కేవలం జమ్ము-కశ్మీర్ మాత్రమే ఈ కోడ్స్‌ను నోటిఫై చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలను ప్రజాభిప్రాయం కోసం ప్రకటించాయి.

మొత్తం 29 లేబర్ చట్టాలను కలగలిపి కేంద్రం నాలుగు లేబర్ కోడ్స్‌ను రూపొందించింది. పార్లమెంట్ 2019లో వేతనాలకు సంబంధించిన వేజ్ కోడ్స్‌ను ఆమోదించింది. సామాజిక భద్రతకు సంబంధించిన సోషల్ సెక్యురిటీ కోడ్, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఆక్యుపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌లను పార్లమెంట్ 2020లో ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. అయితే.. వేజ్ కోడ్ మాత్రం ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొత్త నిబంధన ప్రకారం.. మొత్తం శాలరీలో మూలవేతనం కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో..ఉద్యోగుల భవిష్యనిధికి కేటాయించే మొత్తం పెరగడంతో పాటూ కొన్ని వర్గాల వారికి ట్యాక్స్ భారం పెరిగి చేతికి అందే మొత్తంలో కోత పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే..ఈ నిబంధనల అమలుకు రాష్ట్రాలు పూర్తిగా సిద్ధం కాకపోవడంతో లేబర్ కోడ్స్ అమలును వాయిదా వేస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది.