ప్రహసనంగా కరోనా టెస్టుల నిర్వహణ

Published: Tuesday April 06, 2021

కరోనా వైరస్‌ వేగం పెంచింది. సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బాధితులతోపాటు వారి కాంటాక్ట్స్‌ కూడా పెరిగిపోతున్నారు. మరి అందుకు తగ్గట్టు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారా..? అంటే... లేదనే సమాధానమే వినిపిస్తోంది. అందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఐమాస్క్‌ బస్సే ప్రత్యక్ష ఉదాహరణ. కరోనా లక్షణాలతో బాధపడుతూ టెస్టు చేయించుకోవడానికి జనం వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ బారులు తీరుతుంటే.. వారినుంచి శాంపిల్స్‌ తీసుకునే సిబ్బంది మాత్రం ఒక్కరే ఉన్నారు. పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన వారి ఆధార్‌ నంబరు, వ్యక్తిగత వివరాలు నమోదుచేసుకున్న తర్వాత వారి నుంచి శాంపిల్స్‌ సేకరిస్తారు. అయితే ఐమాస్క్‌ బస్సు వద్ద సిబ్బంది కొరతతో ఈ పనులన్నీ ఒక్కరే చేస్తుండటంతో రోజుకు పట్టుమని పది శాంపిల్స్‌ కూడా సేకరించలేకపోతున్నారు. పైగా సోమవారం కొంతమంది నుంచి నమూనాలు తీసుకున్న ఉద్యోగి కాసేపటికే శాంపిల్స్‌ సేకరించే బడ్స్‌ అయిపోయాయని చెప్పి కౌంటరు మూసేశారు. అప్పటివరకు గంటల తరబడి ఎండలో నిలుచున్న బాధితులు ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. 

 

సెకండ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కరోనా లక్షణాలతో అనేకమంది టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. అయితే విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో కరోనా పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. సెకండ్‌ వేవ్‌ ముప్పు ముంచుకొస్తున్న కీలక దశలో కొవిడ్‌ టెస్టులను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది మార్చిలో కరోనా అలజడి మొదలైన తర్వాత వీరా సంస్థకు చెందిన ఐమాస్క్‌ బస్సుల ద్వారా శాంపిల్స్‌ సేకరించేవారు. విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, రైల్వేస్టేషన్‌, వన్‌టౌన్‌లో గాంధీ మున్సిపల్‌ స్కూల్‌, బసవ పున్నయ్య స్టేడియం, గుణదల మేరీమాత దేవాలయం తదితర ప్రాంతాలతోపాటు.. జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో మొత్తం 24 ఐమాస్క్‌ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిద్వారా రోజుకు 5 వేలకు పైగా నమూనాలు సేకరించేవారు. పాజిటివ్‌ వచ్చిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించేవారు. 

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆరు నెలల పాటు ఈ ప్రక్రియ సజావుగానే సాగినా.. ఆ తర్వాత ఐమాస్క్‌ బస్సుల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది తమకు జీతాలు చెల్లించడం లేదంటూ మూకుమ్మడిగా విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. దీంతో కీలక దశలో కొవిడ్‌ టెస్టులు నిలిచిపోయాయి. తర్వాత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో పరీక్షలు నిర్వహించినా అవి నామమాత్రమే. తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో  యంత్రాంగం టెస్టులను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ మొదలైందని అధికారులే హెచ్చరిస్తుండటంతో ప్రజలు పరీక్షల కోసం క్యూ కడుతున్నారు.