రక్తాన్ని గడ్డ కట్టించడం కరోనా వైరస్‌ తత్వం

Published: Tuesday May 04, 2021

కరోనా ప్రధాన లక్ష్యం ఊపిరితిత్తులే! అయితే అక్కడి నుంచి ఇతర ప్రధాన అవయవాలకు వ్యాపించి, ఆరోగ్యాన్ని కుదేలు చేయడం అనేది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా... ఇలా రెండు మార్గాల్లో సాగుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు కలిగి ఉండి, వయసు పైబడిన వారిలో గుండె కూడా బలహీనపడి ఉంటుంది. ఫలితంగా కొవిడ్‌ సోకడం వల్ల గుండె కండరాలు బలహీనపడే మయోకార్డైటిస్‌ లేదా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు (థ్రాంబోసిస్‌) ఏర్పడవచ్చు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ సమస్యలు రెట్టింపు అవడంతో పాటు కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, వీనస్‌ థ్రాంబోసిస్‌, అరుదుగా గ్యాంగ్రీన్‌ కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లలో వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి ఉండడం మూలంగా కరోనా తేలికగా సోకడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా అప్పటికే హార్ట్‌ ఫెయిల్యూర్‌కు గురయిన వాళ్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కరోనా తీవ్రత పెరిగినప్పుడు గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. గుండె రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. 

 

అలాగే ఊపిరితిత్తుల్లో, మెదడులో రక్తపు గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబాలిజం, బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ కూడా తలెత్తవచ్చు. ఇది కరోనా నేరుగా కాకుండా పరోక్షంగా ప్రభావం చూపించే విధానం. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల నుంచి రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర ప్రధాన అవయవాలకూ వ్యాప్తి చెందుతుంది. ఆ క్రమంలో రక్తనాళాలలోని లోపలి పొర ఎపిథీలియం దెబ్బతిని రక్తం గడ్డలు (థ్రాంబస్‌) ఏర్పడతాయి. ఎక్కడైతే ఈ రక్తపు గడ్డలు ఏర్పడతాయో ఆ రక్తనాళం వెళ్లే మార్గంలోని అవయవానికి రక్తసరఫరా తగ్గుతుంది. ఫలితంగా ఆ అవయవం డ్యామేజీ అవుతుంది. అలా కరోనా ప్రభావంతో గుండె కూడా దెబ్బతింటుంది. ఫలితంగా గుండెపోటు, మయోకార్డైటిస్‌, థ్రాంబోసిస్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టే కరోనా చికిత్సలో రక్తం పలుచనయ్యే మందులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.