ఆ యాప్‌తో జాగ్రత్త

మాల్‌వేర్ (మాలిషియస్ సాఫ్ట్‌వేర్). ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద బెదిరింపు. భారీగా సైబర్ దాడులు చేసేందుకు మోసగాళ్లు ఎన్నుకున్న మార్గమిది. ప్రస్తుతం కొవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్‌ఎంఎస్ వర్మ్ అనే మాల్‌వేర్ ద్వారా మోసగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్‌వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా వారి వ్యక్తిగత వివరాలివ్వడం చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్‌లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని నగరంలోని సీ డాక్, ఐఎస్‌ఈఏ ప్రాజెక్టు మేనేజర్ ఎం.జగదీష్‌బాబు సూచిస్తున్నారు. ఈ మేరకు నిపుణులు వెబ్ పోస్టర్ విడుదల చేశారు.
సైౖబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం
- కొవిడ్ - 19 వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ సైబర్ మోసగాళ్లు ఆండ్రాయిడ్ వినియోగదారుకు ఎస్‌ఎంఎస్ పంపుతారు. అందుకోసం అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్స్ వాడాలని సూచిస్తారు.
- వారు పంపిన కొవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్టర్ యాప్ లింక్‌పై క్లిక్ చేయగానే మాల్‌వేర్ సిస్టంలోకి చేరుతోంది.
- ఈ నకిలీ యాప్ మోసగాళ్లకు వినియోగదారు వ్యక్తిగత సమాచారం, ముఖ్యమైన డేటా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
- అకౌంట్ల వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడుతారు.
- నకిలీ యాప్, నకిలీ ఎస్‌ఎంఎస్‌ల ప్రమాదకర లింకులు బాధితులకు ఉన్న ఇతర కాంటాక్టులకు కూడా విస్తరిస్తాయి.
అపరిచితులు లేదా గుర్తు తెలియని సోర్స్ నుండి వచ్చే అనుమానాస్పద లింకులు, డౌన్‌లోడ్స్ పై క్లిక్ చేయవద్దు. కొవిడ్ వ్యాక్సినేషన్ లేదా సంబంధిత అంశాలకు సంబంధించి నకిలీ లింకులు పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ, పిన్‌నెం. ఆధార్ నెం, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు తదితర వ్యక్తిగత సమాచారం ఎవరికీ షేర్ చేయవద్దు. ప్రామాణికతను సరిచూసుకోకుండా మెసేజ్‌లను, లింక్స్‌ను, సమాచారాన్ని ఫార్వర్డ్ చేయవద్దు. రక్షణ కోసం సెక్యూరిటీ ప్యాచెస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కొవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రామాణికత కలిగిన ప్రభుత్వ వెబ్‌సైట్స్ (కొవిన్ పోర్టల్ - www.cowin.gov.in / ఆరోగ్య సేతు/UMANG మొబైల్ అప్లికేషన్ ఓన్లీ)ను వాడాలి.

Share this on your social network: