కరోనాతో దేశీయోత్పత్తికి గట్టిదెబ్బ

కరోనా రెండో దశ వ్యాప్తితో భారత్ ఆర్థికంగానూ కుదేలవుతోందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. మహమ్మారి మహోగ్ర రూపం వచ్చేనెల చివరి వరకు కొనసాగిన పక్షంలో, ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ రోజువారీగా 21 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,550 కోట్లు) ఉత్పత్తి నష్టపోనుందని అంచనా వేసింది. ఎస్ అండ్ పీ తాజా రిపోర్టులో పేర్కొన్న మరిన్ని విషయాలు..
- పలువురు విశ్లేషకులు భావిస్తున్నట్లు, దేశంలో కరోనా కేసులు ఈనెల చివరినాటికి పతాక స్థాయికి చేరితే, ప్రజా సంచారం సాధారణ స్థాయి కంటే 25-30శాతం వరకు తగ్గవచ్చు. సెప్టెంబరు చివరినాటికి మళ్లీ సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉంది.
- జూన్ చివరికి కొవిడ్ కేసులు పతాక స్థాయికి చేరకుంటే, మొబిలిటీ 40ు క్షీణించవచ్చు. మళ్లీ సాధారణ స్థితికి చేరేందుకు ఈ ఏడాది పూర్తికావచ్చు.
- టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం, వేగంగా వ్యాప్తి చెందే వైరస్ వేరియెంట్ల ముప్పుతో కేసులు జూన్ చివరినాటికి గానీ పతాక స్థాయికి చేరుకోకపోవచ్చు.
- ఈసారి వైరస్ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు బదులు స్థానిక లాక్‌డౌన్‌లను విధిస్తున్నారు. తొలి దశ సంక్షోభంలో బాగా దెబ్బ తిన్న రిటైల్, టూరిజం, ఎయిర్‌లైన్స్ రంగాల రికవరీ ప్రస్తుతం అమలవుతోన్న ఆంక్షలతో మరింత జాప్యం కావచ్చు.
- వైరస్ వ్యాప్తి పరిణామాలపైనా అనిశ్చితి అధికంగా ఉంది. ప్రజా సంచారం గణనీయంగా తగ్గడం దేశంలో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మార్కెట్‌పై కనీసం 1-2 త్రైమాసికాలపాటు ఈ ప్రభావం కనపడనుంది.ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్దీపన చర్యలకూ పెద్దగా అవకాశాలు కన్పించడం లేదు. ఇది వృద్ధి గండికొట్టనుంది. ఎస్ అండ్ పీ గతంలో 2021-22 వృద్ధిరేటును 11 శాతంగా అంచనా వేసింది.
- కొవిడ్‌తో మరిన్ని ఆటుపోట్లు: బిర్లా
కొవిడ్‌తో స్వల్ప కాలిక ఆటుపోట్లు మరింత పెరిగాయని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఈ కష్టకాలంలోనే వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలు, సమాజాలు ఎలాంటి మెరుగైన పరిష్కారాలు చూపిస్తాయనేది ప్రధాన అంశంగా మారిందన్నారు. అహ్మదాబాద్‌లోని ఐఐఎం విద్యార్ధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కష్టకాలంలోనూ ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని విద్యార్థులను కోరారు. మీ ఆసక్తి, శక్తియుక్తులకు తగ్గట్టు జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవాలని కోరారు. కోవిడ్ ముప్పు వేధిస్తున్నా గత నాలుగు నెలల్లో పది భారత స్టార్టప్ కంపెనీలు 100 కోట్ల డాలర్లకు పైగా విలువతో యూనికార్న్‌లుగా ఎదిగిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు.
బుర్రలకు పదును పెట్టండి: కొవిడ్ కష్ట కాలమైనప్పటికీ, వినూత్న వ్యాపార అవకాశాలపై యువత దృష్టి పెట్టాలని బిర్లా యువతను కోరారు. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కొవిడ్‌పై మానవాళి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Share this on your social network: