అత్యవసరానికి మాత్రమే ఈ-పాస్ : డీజీపీ

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అత్యవసరంగా ప్రయాణించాలనుకొనే వారికోసం ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును, పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద పరిస్థితులను సీపీ బత్తిన శ్రీనివాసులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం ఈపాస్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నప్పటికీ, అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం ఉన్న షరతులు వర్తిస్తాయని చెప్పారు.
కరోనా తీవ్రత, కేసుల పెరుగుదల దృష్ట్యా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యాయం కోసం బాధితులు పోలీ్‌సస్టేషన్ల వరకు రావాల్సిన అవసరం లేదని, ఏపీ పోలీస్ సేవా యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.

Share this on your social network: