తెలంగాణలో లాక్‌డౌన్!?

కరోనా మహమ్మారి రెండో దశలో పెనుతుఫానులా విరుచుకుపడుతుండడంతో రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రాత్రి కర్ఫ్యూను 15 వరకు పొడిగించింది. అయినా కొవిడ్ ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. వైర్‌సను కట్టడి చేయాలంటే రాష్ట్రంలోనూ లాక్‌డౌన్ విధించాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారు కూడా లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కాబోతోంది. దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి. దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ విధించాయి.
తెలంగాణలో రెండు వారాలుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండగా, ఏపీలో పాక్షిక లాక్‌డౌన్ అమలవుతోంది. లాక్‌డౌన్ వల్ల ప్రజాజీవనం స్తంభించడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముందని ఈ నెల 6న సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కరోనా పెద్దగా తగ్గలేదని, సరైన ఫలితాలూ రాలేదనే నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి కర్ఫ్యూను ఈ నెల 15 వరకూ పొడిగించారు. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. కరోనా వైరస్ సంక్రమణ గొలుసుకట్టును తెంచడానికి లాక్‌డౌనే సరైన మార్గమని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినప్పటికీ కేసులేమీ తగ్గలేదని నివేదికలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. కొన్ని వర్గాలు లాక్‌డౌన్ పెట్టాల్సిందేనంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై లాక్‌డౌన్ విధిస్తే కలిగే లాభనష్టాలపై, ధాన్యం కొనుగోళ్లపై లాక్‌డౌన్ ప్రభావంపైనా చర్చించనుంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
రోజురోజుకూ కేసులు భారీగా పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో ఈ నెల 10 నుంచి 24 వరకు, కేరళలో ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్‌డౌన్ విధించారు. రాజస్థాన్‌లో ఈ నెల 10 నుంచి 24 వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు గెహ్లోత్ సర్కారు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బిహార్‌లో ఈ నెల 4 నుంచి 15 వరకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ విధించగా.. దాన్ని ఈ నెల 17 వరకు పొడిగించారు. మహారాష్ట్రలో ఏప్రిల్ 5 నుంచే లాక్‌డౌన్‌తో సమానమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలు ఉన్నాయి. పంజాబ్‌లో ఇప్పటికే వారంతాపు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. వీటిని ఈ నెల 15 వరకు పొడిగించారు. యూపీలో కొవిడ్ ఆంక్షలు సోమవారం వరకు అమల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. హరియాణాలో విధించిన వారం రోజుల లాక్‌డౌన్ సోమవారంతో ముగిసింది. ఒడిసాలో 14 రోజుల లాక్‌డౌన్ అమలవుతోంది. ఝార్ఖండ్‌లో లాక్‌డౌన్ లాంటి నిబంధనలను ఏప్రిల్ 22 నుంచి ఈ నెల 6 వరకు అమలు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లో ఈ నెల 15 లాక్‌డౌన్‌ను వరకు పొడిగించారు. పలు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కర్ఫ్యూలు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

Share this on your social network: