ఆక్సిజన్ పడకలూ కిటకిట

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు దాదాపుగా కొవిడ్ బాధితులతో నిండిపోయినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 6,803 ఐసీయూ పడకల్లో 6,247 నిండాయనీ, కర్నూలులో 263, ఇతర చోట్ల మిగిలినవి ఖాళీగా ఉన్నాయన్నారు. వివిధ ఆస్పత్రులన్నింట్లో కలిపి ఉన్న 23,372 ఆక్సిజన్ బెడ్లలోనూ ఇప్పటికే 22,299 నిండిపోయాయని చెప్పారు. రాష్ట్రంలోని 102 కొవిడ్ కేర్‌సెంటర్లలో ఏర్పాటు చేసిన 49,240 బెడ్లలో మాత్రం 15,056 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఈ నెలాఖరులోపు 17 లక్షలమందికి పైగా ప్రజలకు రెండోడోస్ వేయాల్సి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు అడ్డు పడనట్లయితే విదేశాల నుంచైనా టీకాలు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సోమవారం మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో అనిల్‌కుమార్ సింఘాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి, నివారణ చర్యలు, వాటి అమలుపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారని సింఘాల్ తెలిపారు.
ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నింటినీ కవర్ చేయాలని, వాటిల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందేలా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో 648 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా రోగులకు నగదురహిత చికిత్స అందుతోంది. సోమవారం మధ్యాహ్నానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 47,644 పడకల్లో ఆరోగ్య శ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతున్నారు. వీరికి అందించే వైద్యసేవలకు అయ్యే మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఆస్పత్రులకు చెల్లిస్తుంది. రాష్ట్రంలో 6,90,677 మందికి కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ ఇవ్వాల్సి ఉండగా, ఈ నెల 31నాటికి ఆ సంఖ్య 17 లక్షలమందికిపైగా పెరగనుంది. పైగా ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఎంతైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని సింఘాల్ తెలిపారు.
రాష్ట్రంలో రెండో డోసు ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్రం ఇచ్చే కోటా సరిపోదని సింఘాల్ అన్నారు. రాష్ట్ర జనాభా అంతటికీ అవసరమైన 4 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు అవసరమైన రూ.1600 కోట్లను ఇప్పుడే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర నిబంధనలు అడ్డంకిగా మారాయని చెప్పారు. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతాన్ని కేంద్రానికి ఇచ్చి, మిగిలిన 50 శాతాన్ని కేంద్రం సూచించిన కోటా ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. విదేశీ టీకాల కొనుగోలుకు కేంద్రం అనుమతిస్తే స్పుత్నిక్-వి తదితరాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 24,273 రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండ గా, ప్రైవేట్ ఆస్పత్రులకు 10,738 ఇచ్చామని చెప్పారు.
మొత్తం ఐసీయూ పడకలు : 6,803
ఇప్పటికే నిండినవి : 6,247
మొత్తం ఆక్సిజన్ పడకలు : 23,372
ఇప్పటికే నిండినవి : 22,299
కేర్ సెంటర్లలో బెడ్లు : 49,240
ఇప్పటికే నిండినవి : 5,056

Share this on your social network: