15 టన్నుల సామర్థ్యం కలిగిన 6 ట్యాంకర్లు భువనేశ్వర్‌కు తరలింపు

Published: Wednesday May 12, 2021

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీకాలు, ఆక్సిజన్‌, వైద్య పరికరాలు, మందులు సంబంధిత సహాయక కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 2008 నుంచి ఎలాంటి వాణిజ్య విమాన కార్యకలాపాలు నిర్వహించకుండా మూసివేసిన బేగంపేట్‌ విమానాశ్రయాన్ని కరోనా వ్యాక్సిన్‌, మందుల ఎగుమతులు, దిగుమతుల కోసం తిరిగి తెరిచారు. రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరగడం, ఆక్సిజన్‌ సరఫరా కొరత తరువాత ఒడిశాలోని అంగుల్‌ నుంచి భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) విమానాల సహాయంతో ఆక్సిజన్‌ను తీసుకు వస్తుండటం వల్ల ఈ విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదివారం 15 టన్నుల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఐఏఎఫ్‌ విమానంలో బేగంపేట్‌ నుంచి ఒడిశాకు పంపించారు. మొత్తం 90 టన్నుల సామర్థ్యం కలిగిన 6 ట్యాంకర్లను ఒడిశాకు పంపారు. ఈ ట్యాంకర్లు మొదట భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా అంగుల్‌కు చేరుకుంటాయి. అక్కడ ఆక్సిజన్‌ను ఫిల్లింగ్‌ చేసిన తరువాత ట్యాంకర్లు మూడు రోజుల్లో రోడ్డు మార్గం ద్వారా నగరానికి చేరుతాయి. అంతకు ముందు మరో 4 ట్యాంకర్లను కూడా భువనేశ్వర్‌కు తరలించారు.

ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతోపాటు కొవిడ్‌ రోగులకు అవసరమైన  మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు బేగంపేట్‌ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా మందులు పంపినట్లు అధికారులు తెలిపారు. సరైన చికిత్స కోసం కొవిడ్‌-19 రోగులను ఇతర రాష్ట్రాల నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో నగరానికి తీసుకురావడం, వారిని తిరిగి స్వస్థలాలకు చెరవేయడంలో బేగంపేట్‌ విమానాశ్రయం కీలకపాత్రను పోషిస్తుంది. గతేడాది మహమ్మారి సమయంలో అనేక మంది రోగులను చికిత్స కోసం నగరానికి తరలించారు. విమానాశ్రయంలో కార్యకలాపాలను నిర్ధారించడానికి, విమానాల రాకపోకల కోసం సిబ్బంది తెల్లవారుజామున 1.30గంటల వరకు విధుల్లో ఉంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. 100 మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారని విమానాశ్రయం డైరెక్టర్‌ పేర్కొన్నారు. మార్చి 2008లో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత బేగంపేట్‌ విమానాశ్రయంలో వాణిజ్య, విమాన కార్యకలాపాలు మూసివేయబడ్డాయి. అప్పటి నుంచి ఆహారాన్ని రవాణా చేసేందుకు, వరదలు వంటి ఏదైనా విపత్తు సమయంలో అత్యవసర సేవల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలకు ఇతర సహాయక సామగ్రి ఎగుమతి చేయడానికి, అంతర్జాతీయ విమానయాన కార్యక్రమాలు కూడా బేగంపేట్‌ విమానాశ్రయంలో జరుగుతాయి. వింగ్స్‌ ఇండియా, ద్వైవార్షిక సివిల్‌ ఏవియేషన్‌ ఎగ్జిబిషన్‌ ఎయిర్‌షో 2020 మార్చిలో ఇక్కడ నిర్వహించారు. ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉపయోగించే చాపర్స్‌, వీఐపీలు, రాజకీయ నాయకుల చార్టర్డ్‌ విమానాలు నడుస్తాయి. భారత వాయు సేనా కెడెట్స్‌ శిక్షణ కోసం బేగంపేట్‌ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తున్నారు.