రాష్ట్రంలో వరుసగా రెండోరోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు

Published: Thursday May 13, 2021

రాష్ట్రంలో వరుసగా రెండోరోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,750 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 21,452 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 89 మంది చనిపోయారని వైద్యఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 13,44,386కి, మొత్తం మరణాల సంఖ్య 8,988కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,927 మందికి వైరస్‌ సోకగా.. విశాఖపట్నంలో 2,238, అనంతపురంలో 2,185, చిత్తూరులో 1,908, గుంటూరులో 1,836, కడపలో 1,746, నెల్లూరులో 1,689, కర్నూలులో 1,524, శ్రీకాకుళంలో 1,285, పశ్చిమగోదావరిలో 1,232, ప్రకాశంలో 1,192, కృష్ణాలో 997, విజయనగరంలో 693 కేసులు నమోదయ్యాయి.

 

ఒకరోజు వ్యవధిలో 19,095 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 11,38,028కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.కరోనాతో పోరాడుతూ విశాఖపట్నంలో 11 మంది మృతిచెందగా.. తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో తొమ్మిదేసి మంది చొప్పున, చిత్తూరు, గుంటూరు, నెల్లూరుల్లో ఎనిమిదేసి మంది చొప్పున, శ్రీకాకుళంలో ఏడు, అనంతపురంలో ఆరు, కర్నూలులో ఐదు, ప్రకాశంలో నాలుగు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీర పాండియన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బుధవా రం ఆయనే స్వయంగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. కలెక్టర్‌ వ్యక్తిగత సిబ్బంది కూడా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. 

ఏపీ దళిత బహుజన ఫ్రంట్‌(ఏపీ డీబీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విశ్రాంత అధికారి జెల్ది ఇస్మాయిల్‌బాబు(61) కరోనాతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. గతంలో ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా ఉద్యోగ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశా రు. ఇస్మాయిల్‌ మృతిపై కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ఎమ్మెల్యే ముస్తఫా సంతాపం తెలిపారు.