ఇవి జీవితంలో భాగం కావాలి.. సీఎం పిలుపు

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొవిడ్‌తో సహ జీవనం చేయడమొక్కటే మార్గమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. అలా సహజీవనం చేస్తూనే, తగిన జాగ్రత్తలతో కొవిడ్‌పై యుద్ధం చేయాలన్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం కింద గురువారం రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సినేషన్ పూర్తయితేనే కొవిడ్‌ను పూర్తిస్థాయిలో నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే... తగిన స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. ‘‘ఇలాంటి విషమ పరిస్థితి ఎందుకు ఉందంటే... దానికి కారణం దేశంలో రెండే రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ నెలకు కోటి డోసులు, సీరం ఇన్‌స్టిట్యూట్ నెలకు 6 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే... రెండూ కలిపితే మొత్తం కేవలం 7 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే మన దేశంలోని కంపెనీలకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒకే మార్గం కనిస్తుంది. అది... కొవిడ్‌తో సహజీవనం చేయక తప్పదు. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది’’ అని జగన్ పేర్కొన్నారు. దే శంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు డోసులు ఇవ్వాలంటే... 172 కోట్ల డోసులు కావాలన్నారు. ‘‘కానీ, ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్ల డోస్‌లు మాత్రమే ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వీరందరికీ రెండేసి డోస్‌లు ఇవ్వాలంటే... 7 కోట్ల డోస్‌లు ఇవ్వాలి. కానీ... మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షలు మాత్రమే’’ అని తెలిపారు.
‘‘ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతికదూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి’’ అని జగన్ సూచించారు. రైతులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ పనులు చేసుకోవాలన్నారు.

Share this on your social network: