ఏపీ అంబులెన్స్‌లకు లైన్‌క్లియర్

కరోనా బారిన పడి.. అటు సొంత రాష్ట్రంలో తగిన వైద్య సౌకర్యాలు లేక, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తుంటే ఇటు తెలంగాణ పోలీసులు అంబులెన్సులను అనుమతించక కొట్టుమిట్టాడుతున్న రోగులకు ఊరట లభించింది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులకు తెలంగాణ-ఏపీ రాష్ట్రాల సరిహద్దులో ఆంక్షలు తొలగిపోయాయి. ఈ-పాస్ లేకున్నా అంబులెన్స్‌లను తెలంగాణలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపవద్దని ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించడంతో వారు ఆంక్షలను ఎత్తివేశారు. అయితే శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సులను సరిహద్దుల్లోని పలు చెక్‌పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనుమతి లేనిదే రాష్ట్రంలోకి రానివ్వబోమని, హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో బెడ్ అందుబాటులో ఉన్నట్లుగా పత్రంతోపాటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ-పాస్ ఉంటేనే పంపిస్తామని చెప్పడంతో రోగుల బంధువులు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ పోలీసులతో మంతనాలు జరిపినా ఫలితం లేకపోయింది.
దీంతో ఏపీ నేతలు పలువురు.. తెలంగాణ పోలీసుల తీరును, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం 100కు పైగా అనుమతి లేని అంబులెన్స్‌లను అడ్డుకొని వెనక్కి పంపించారు. చాలా మంది రోగులు పోలీసులను బతిమాలినా అనుమతించకపోవడతో అంబులెన్స్‌లో ఉన్న కరోనా రోగులు తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంధువులతోపాటు బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామస్వామి, వంద మందికిపైగా కార్యకర్తలు పుల్లూరు టోల్ ప్లాజా వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా.. ఇది తెలంగాణ బోర్డర్ అని, ఇక్కడ ఆందోళన, రాస్తారోకోలు చేస్తే అందరిపైనా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ హెచ్చరించారు. దీంతో వారు టోల్‌ప్లాజాకు కిలోమీటర్ దూరంలో ఉన్న ఏపీ బోర్డర్‌లోకి వెళ్లి ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఫలించని ఎమ్మెల్యేల మంతనాలు..
కర్నూలు జిల్లాకు చెందిన కరోనా రోగుల అంబులెన్స్‌లను పోలీసులు వెళ్లనివ్వడంలేదని పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. దీంతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, గద్వాల జిల్లా ఎస్సీ ఇతర పోలీసులతో మంతనాలు జరిపినా అంబులెన్స్‌లకు అనుమతి ఇవ్వలేదు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ కూడా వచ్చి జిల్లా ఎస్పీతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. వెనక్కి పంపిన ఓ అంబులెన్స్‌లో అనంతపూర్‌కు చెందిన రోగి ఒకరు తిరిగి వెళుతూ నంద్యాల ప్రాంతంలో అంబులెన్స్‌లోనే తుది శ్వాస విడిశారు. ఈ ఘటన మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ-ఏపీ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబులెన్స్‌లోని బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నుంచి మొత్తం ఏడు అంబులెన్సులు రాగా, ఎవరి వద్దా సరైన అనుమతి పత్రాలు లేకపోవటంతో వెనక్కి పంపినట్లు పోలీసులు తెలిపారు. కరోనాతో కాకుండా సాధారణ ఆరోగ్య సమస్యలు తలెత్తిన ఏపీ పౌరులను కూడా పోలీసులు అనుమతించలేదు.
రామాపురం గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానినికి చెందిన ఓ యువతికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో, వైద్యం కోసం ద్విచక్రవాహనంపై కోదాడకు బయలుదేరగా సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. నల్లగొండ జిల్లాలోని దామరచర్ల చెక్‌పోస్టు వద్ద కూడా అనుమతి లేని మూడు అంబులెన్స్‌లను వెనక్కి పంపించారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కొవిడ్, ఇతర వ్యాధులతో హైదరాబాద్‌కు వచ్చే పేషంట్లకు సంబంధించిన అంబులెన్స్‌లను తెలంగాణలోకి సంగారెడ్డి జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

Share this on your social network: