ముఖ్యమంత్రి జగన్‌కు లోకేశ్‌ లేఖ

Published: Sunday May 16, 2021

 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు అనుసరించిన డిజిటల్‌ మూల్యాంకనంపై అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. జవాబు పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని, అభ్యర్థుల పేర్లు, మార్కులను వెల్లడించాలన్నారు. శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఆయన ఈ మేరకు లేఖ రాశారు. ‘‘గతేడాది డిసెంరులో జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్ష ఫలితాలను ఏప్రిల్‌ 28న ప్రకటించారు. దాదాపు ఏడువేలమంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూలకు స్పోర్ట్స్‌ కోటాతో కలిపి 340 మంది అర్హత సాధించారు. ఎంపికయ్యే అభ్యర్థులు సబ్‌ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఉన్నతాధికారులుగా సేవలందిస్తారు. కాబట్టి పరీక్ష విధానం పారదర్శకంగా, అనుమానాలు లేకుండా ఉండాలి. పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం సక్రమంగా జరగలేదని చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఎంపిక విధానం గతంలో జరిగిన ప్రక్రియకు విరుద్ధంగా ఉంది. ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్‌ మూల్యాంకనం ఎంచుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతిక ప్రమాణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అనుమానాలు నివృత్తి చేయడానికి, ఫిర్యాదుల కోసం ఆన్‌లైన్‌ పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలి. కరోనా సాకుతో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక, చట్టపరమైన, విధానపరమైన పద్ధతులను విస్మరించడం తగదు. ఎలాంటి సన్నాహాలు లేకుండా అమలు చేసిన డిజిటలైజేషన్‌ విధానం అభ్యర్థులకు శాపం కారాదు’’ అని లేఖలో లోకేశ్‌ పేర్కొన్నారు.