ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు ధరలు నిర్ణయించండి

‘‘కరోనా చికిత్స అందించే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను నియంత్రించాలి. గరిష్ఠ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలి. అందులో ఎక్స్-రే, సీటీస్కాన్, ముఖ్యమైన రక్తపరీక్షలు, పీపీఈ కిట్ల ధరలు చేర్చుతూ 48 గంటల్లో జీవో ఇవ్వాలి’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ జీవోను అన్ని ఆస్పత్రుల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శిచాలని.. ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాల్లో విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు గత ఏడాది ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీని పునరుద్ధరించాలని, బాధితులు కమిటీకి ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి తక్షణమే వేతనాలు, బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా కట్టడి, లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వ చర్యలపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం మరోసారి విచారించింది. ‘‘కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను చూస్తున్నాం. థర్డ్‌వేవ్ కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది చిన్న పిల్లలపైనా ప్రభావం చూపుతుందంటున్నారు. దీన్ని ఎదుర్కొనేందకు ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులను అడ్డుకొనే ఉత్తర్వులను తాము నిలిపివేయడంతో కేంద్రం కూడా స్పందించిందని.. రాష్ట్రానికి అందిస్తున్న 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు అదనంగా మరో 200 టన్నులు కేటాయించిందని తెలిపింది. రెమ్‌డెసివిర్ కోటాను రోజుకు 10వేలకు పెంచిందని గుర్తుచేసింది.
లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ సందర్భంగా డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు తీసుకున్న చర్యల పట్ల ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. రంజాన్ నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలు బాగా అమలు చేశారని కొనియాడింది. ఇదే ఒరవడి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ రోగులకు, వారి సహాయకులకు సహకరించడానికిగాను జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రవ్యాప్తంగా 57 కొవిడ్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయడాన్ని అభినందించింది. ఈ వ్యాజ్యంలో డీజీపీ కౌంటర్ దాఖలు చేశారు. ప్రాణరక్షణ ఔషధాలను బ్లాక్ మార్కెట్ చేస్తున్నవారిపై ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 98 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసులు పెట్టి రూ.30.68 కోట్ల జరిమానా విధించగా.. లాక్‌డౌన్ తర్వాత మే 12 నుంచి 15 మధ్య 3 రోజుల్లో మాస్కులు పెట్టుకోని వారిపై 19037 కేసులు పెట్టి రూ.1.26 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించని వారిపై 2990, ఎక్కువ మంది గుమిగూడిన ఘటనలపై 1959, రాత్రి కర్ఫ్యూ ఉల్లంఘనలపై 26,082 కేసులు పెట్టినట్లు వివరించారు.
ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కొంత కాలంగా వేతనాలు చెల్లించడం లేదంటూ.. కింగ్‌కోఠి ఆస్పత్రిలో సిబ్బంది వెతలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ధర్మాసనం స్పందించింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారిలో 15 మంది టీచర్లు ప్రాణాలు విడిచినట్లు చెబుతున్నందున వారిని కరోనా యోధులుగా గుర్తించి, సాయం చేయాలని, ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని స్పష్టం చేసింది. పేదలు, అనాథలు, జైళ్లలో ఖైదీలకు టీకాలిచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశించింది.
అన్ని జిల్లాల్లోని ఎన్జీవోలతో అధికారులు సమన్వయం చేసుకుని కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా బారినపడి హోం క్వారంటైన్‌లో ఉండే వారికి నామమాత్రం లేదా ఉచితంగా భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం 48 గంటల్లో జీవో జారీ చేయాలని సూచించింది. కరోనా టెస్టులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆర్టీపీసీఆర్, ఆర్‌ఏటీ టెస్టులు ఎన్ని చేశారో వివరిస్తూ ఒక పట్టిక రూపంలో నివేదిక ఇవ్వాలని మరోమారు స్పష్టం చేసింది. ఎంతమంది కరోనా వల్ల మరణించారు? ఎన్ని మృతదేహాలను ఖననం/దహనం చేశారో చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టారని ఆక్షేపించింది. 14 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కేంద్రాలు మే 15 కల్లా సిద్ధమవుతాయని చెప్పారని, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. మొబైల్ వ్యాన్ల సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి టెస్టులు చేయడం వల్ల ఊర్లలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.
లాక్‌డౌన్‌లో ప్రజా రవాణా లేక దూర ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడం కష్టసాధ్యమవుతోందని, ఈ అంశంపైనా దృష్టి సారించాలని సూచించింది. ఆక్సిజన్, ప్రాణరక్షక ఔషధాల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకునేందుకు రాష్ట్రస్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్నందున నిర్వాసితుల ఇళ్లు కూల్చివేసి రోడ్డున పడేస్తే ఎలాగని ప్రశ్నించింది. జూన్ 30 వరకు ఖాళీ చేయించరాదన్న కోర్టు ఆదేశాలను అమలు పర్చాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు స్పష్టంచేసింది. తదుపరి విచారణకు జూన్ 1కి వాయిదా వేసిన ధర్మాసనం.. ఆ రోజున ప్రజారోగ్య సంచాలకుడు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులు హాజరు కావాలని తేల్చిచెప్పింది.

Share this on your social network: