రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచనలు

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన తరువాత కేసుల సంఖ్య పెరిగాయా, తగ్గాయా అని ఆరా తీసింది. ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రుల్లో శానిటైజేషన్ సక్రమంగా చేపట్టడం లేదని, రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని...సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మెడికల్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు నర్సింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఉపయోగించుకోవాలని సూచించింది. కొవిడ్ బాధితులు, వారి బంధువులు బెడ్ల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగానే వారి ప్రాణాలు పోతున్నాయని, ఖాళీ బెడ్ల వివరాలు తెలిపేలా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర ప్రజలు గుంపులుగా చేరకుండా, రద్దీ తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. సీనియర్ సిటిజన్స్‌తో పాటు వికలాంగులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్యపరిస్థితిని బంధువులకు తెలియపర్చేందుకు హెల్త్ బులిటెన్ విడుదల చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కట్టడి, చికిత్స విషయంలో పలు అంశాలు లేవనెత్తిన ధర్మాసనం.. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ తోట సురేశ్‌బాబు గతేడాది సెప్టెంబరులో పిల్ దాఖలు చేశారు. అలాగే కరోనా కట్టడికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్(ఏపీసీఎల్‌ఏ) సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు పిల్ వేశారు. ఆక్సిజన్ అందక జరిగిన మరణాలకు పరిహారం ఇప్పించడంతో పాటు కొవిడ్ చికిత్సలో ఎదురవుతున్న ఇబ్బందులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదులు రాసిన 3 లేఖలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించింది. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. ధర్మాసనం సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) సి.సుమన్ కోర్టుకు తెలిపారు. కర్నూలు, హిందూపురంలో ఆక్సిజన్ లేక కొవిడ్ బాధితులు మరణించారనేది అవాస్తవమన్నారు. కకర్ఫ్యూ వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా? అని ధర్మాసనం ప్రశ్నించగా, వైరస్ చెయిన్‌ను బ్రేక్ చేసేందుకే కర్ఫూ అమల్లోకి తెచ్చామని, కేసులు సంఖ్య తగ్గేందుకు కొంత సమయం పడుతుందని, గతంలో కంటే ఉధృతి తగ్గిందని వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటైజేషన్ సక్రమంగా జరగడంలేదని, కరోనా బాధితులకు షోషకాలు ఉన్న ఆహారం అందించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే, కాంట్రాక్టర్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని ఎస్‌జీపీ చెప్పగా...రూ.30, రూ.40తో ఎలాంటి ఆహారం అందిస్తారో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆస్పత్రులు లక్షలు వసూలు చేస్తున్నాయని, నగదు రూపంలో చెల్లించేవారికే బెడ్ ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, అశోక్ రామ్, నర్రా శ్రీనివాసరావు, జీవీ సుధాకర్, అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వివరించారు. రెమ్‌డెసివిర్ సరఫరాకు కేంద్రం శాస్త్రీయ విధానం పాటించడం లేదని, తక్కువ కేసులున్న రాష్ట్రాలకు ఎక్కువ వైల్స్ సరఫరా చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బార్‌లు, లిక్కర్ షాపులు మూసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వ్యాక్సిన్, మందులు, ఆక్సిజన్ అందుబాటుపై ధర్మాసనం ఆరా తీయగా, డిమాండ్‌కు తగ్గట్లు కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదని ఎస్‌జీపీ వివరించారు. హైకోర్టు వద్ద 45ఏళ్లు పైబడిన, రెండో డోస్ తీసుకొనే సిబ్బందికి, న్యాయవాదులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ ఎస్.శ్రీరామ్ తెలిపారు. రిజిస్ట్రార్ జనరల్‌తో సమన్వయం చేసుకొని వాక్సిన్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.

Share this on your social network: