బ్లాక్‌ ఫంగ్‌సపై రాష్ట్రం నిర్లక్ష్యం

Published: Sunday May 23, 2021

 ఏపీపై బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది. కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉండడం కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ కేసులు ఏపీని చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రోజుకు 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు, 22 నుంచి 24 శాతం మేర పాజిటివిటీ రేటు నమోదవుతోంది. ప్రతిరోజు వంద మందికి పైగా కరోనాతో మరణిస్తున్నారు. ఈ పరిణామాలతోనే రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే.. ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ భారీ ఎత్తున కలవరపెడుతోంది. కరోనా బారినపడి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా వివిధ ఆస్పత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర అధికారుల వద్ద దీనికి సంబంధించి సమాచారం ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, కేంద్ర మంత్రి సదానంద గౌడ శనివారం ఒక ట్వీట్‌ చేస్తూ.. ఏపీలో 910 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో ఏపీ మూడోస్థానంలో ఉందని ప్రకటించారు. అత్యధికంగా గుజరాత్‌లో 2,281, మహారాష్ట్రలో 2000 బ్లాక్‌ ఫంగస్‌ కేసులున్నాయి. ఆ తర్వాత ఏపీలోనే అత్యధికంగా 910 బ్లాక్‌ పంగస్‌ కేసులున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక, ఏయే రాష్ట్రాలకు ఎన్ని మందులు ఇచ్చారో కూడా కేంద్ర మంత్రి తెలిపారు. బ్లాక్‌ ఫంగ్‌సను కట్టడి చేసే యాంపోటెరిసిన్‌-బీ ఇంజక్షన్లను గుజరాత్‌కు 5,800, మహారాష్ట్రకు 5090, ఏపీకి 2310 ఇంజక్షన్లు ఇచ్చినట్లు ఆయన ట్విట్టర్‌లో వివరించారు.

 

దేశ వ్యాప్తంగా 8,848 కేసులు నమోదయ్యాయని, కేంద్రం సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయా రాష్ట్రాలకు 23,680 అదనంగా యాంపోటెరిసిన్‌-బీ ఇంజక్షన్లు పంపించినట్లు సదానంద గౌడ తెలిపారు. మరోవైపు తెలంగాణలో 350 కేసులు గుర్తించామని, దీంతో 890 ఇంజక్షన్లు పంపినట్లు తెలిపారు. కర్ణాటకలో 500 కేసులు నమోదుకాగా 1270 ఇంజక్షన్లు,  తమిళనాడులో 40 కేసులకుగాను 140 ఇంజక్షన్లు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. 

 

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నా.. కేసుల సంఖ్య కూడా వందల్లోకి చేరిపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుల గుర్తింపు, పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగ్‌సకు సంబంధించి కేంద్ర మంత్రి సదానందగౌడ 910 కేసులున్నాయని చెబుతుండగా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో 40నుంచి 50 మధ్యలోనే బ్లాక్‌ ఫంగస్‌ కేసులున్నాయి. దీంతో కేంద్రం చెబుతున్న లెక్కలకు ఏపీ అధికారులు వెల్లడిస్తున్న లెక్కలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. ఇక, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం బ్లాక్‌ ఫంగస్‌ కేసులను చేర్చుకోవడం లేదు. దీంతో ప్రతిఒక్కరికీ ప్రభుత్వ బోధనాసుపత్రులే దిక్కయ్యాయి. ఇలాంటి సమయంలో కేసుల విషయం లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆరోగ్యశాఖ కేవలం ఆసుపత్రులు కేటాయించి.. మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందనే వాదన వినిపిస్తోంది. దీనిపై ఇప్పటిదాకా సరైన కమిటీనికానీ, ప్రత్యేక నోడల్‌ అధికారులనుకానీ నియమించలేదు. ఇలానే నిర్లక్ష్యంగా ఉంటే బ్లాక్‌ ఫంగస్‌ కూడా మరో కరోనాలా మారే అవకాశం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.