ఫేస్‌బుక్, ట్విటర్‌పై నిబంధనల కత్తి

దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్‌పై నిబంధనల కత్తి వేలాడుతోంది! సోషల్ మీడియా కట్టడికి ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభు త్వం రూపొందించిన కొత్త నియమావళి గుర్తుందా? అది బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా కేంద్రం సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ గడువు మంగళవారంతో ముగియనుంది. ఆ నియమావళి ప్రకారం.. అన్ని రకాల సామాజిక మాధ్యమాలూ తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి. అలాగే.. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయా న్ని వారికి తెలియజేయాలి.
15 రోజుల్లోగా పరిష్కరించాలి. సోషల్ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం ‘చీఫ్ కంప్లయన్స్ అధికారి’ని నియమించాలి. పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండే లా ‘నోడల్ కాంటాక్ట్ పర్సన్’ను నియమించాలి. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలి. వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. ఇలా ఎన్నో నిబంధనలను కేంద్రం విధించింది. కానీ.. ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందినఒక్క ‘కూ’ సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం మూడు నెలల సమయమివ్వగా.. ఆయా సంస్థలు మాత్రం ఆరు నెలల సమయం అడుగుతున్నాయి.

Share this on your social network: