బ్లాక్‌ ఫంగస్‌కు అందుబాటులో లేని మందులు

Published: Tuesday May 25, 2021

 కరోనా కనికరిస్తోంది.. అనుకుంటున్న తరుణంలో బ్లాక్‌ ఫంగస్‌ జిల్లాపై విరుచుకుపడుతోంది. ప్రభుత్వం బ్లాక్‌ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ లో చేర్చామని ప్రకటించింది. అయితే ఈ రోగులకు అవసరమైన చికిత్స ఎలా అనే విషయంపై మాత్రం అటు ప్రభుత్వం ఇటు వైద్యఆరోగ్యశాఖ దృష్టి సారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చామని చెబుతున్నా జిల్లాలో ఏ వైద్యశాలలోనూ చికిత్స అందుబాటులో లేదు. ఇప్పటికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప త్రులలో సుమారు 500 మందికి పైగా బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు లెక్కతేలారు. వీరంతా చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చికిత్సకు అవసరమైన మందుల సరఫరా లేదనే విమర్శలు వస్తున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు యాంఫోటెరిసిన్‌ - బీ అనే ఇంజక్షన్‌ సమర్ధవంతంగా పని చేస్తుందని అధికారులు ప్రకటించారు.

 

అయితే ఈ మందులు జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేవు. సరఫరా నేడు  - రేపు అంటున్నారే తప్ప ఆ మందు వచ్చిన ఆనవాళ్లు లేవు. ఒక్కో బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడికి సుమారు 60 డోసుల ఇంజక్షన్‌ అందించాలి. ఈ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం జిల్లాలో ఉన్న బాధితులకే 30 వేల డోసులు కావాలి. కానీ ప్రభుత్వం వందల సంఖ్యలోనే సరఫరా చేస్తామని చెబుతున్నట్లు సమాచారం. రెమ్‌డెసివర్‌ ఇంజక్లన్ల మాదిరిగానే ప్రస్తుతం బ్లాక్‌లో యాంఫోటెరిసిన్‌ - బీ ఒక్కో వైల్‌ రూ.వేలల్లో నగదు వసూలు చేసి కొన్ని ఆసుపత్రుల్లో అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడికి చికిత్సకు రూ.లక్షలకు లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. అంత చెల్లించలేని బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ సలహాలకే పరిమితమై చికిత్స ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ డ్రగ్‌ను అందుబాటులోకి తెస్తేనే బ్లాక్‌ ఫంగస్‌ బాధి తులకు ఊరట లభిస్తుంది.