బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుఫా

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుఫాన్ మంగళవారం ఉదయం మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా, రాత్రికి అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది ఒడిశాలోని పారాదీ్‌పకు 150, బాలాసోర్‌కు 250 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని దిఘాకు 240, సాగర్‌దీవులకు 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం తెల్లవారుజాముకు పూర్తిగా వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి బాలాసోర్‌కు దక్షిణాన దామ్రా ఓడరేవుకు అతి దగ్గరగా వెళ్లనుంది. తర్వాత ఉత్తర వాయువ్యంగా పయనించి బుధవారం మధ్యాహ్నం తరువాత దామ్రా పోర్టుకు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నానికే పశ్చిమ, తూర్పు, వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది.
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దామ్రా, చాంద్‌బలి మధ్యలో యాస్ తీరం దాటొచ్చని భావిస్తున్నారు. చాంద్‌బలి పట్టణంపై గరిష్ఠంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. తీరం దాటడానికి ముందు, తర్వాత ఆరుగంటలపాటు తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు హోంశాఖ సహాయమంత్రి డీఎస్ మిశ్రాను బాలాసోర్‌కు పంపించారు. యాస్ తీరం దాటే సమయంలో 2 నుంచి 4.5 మీటర్ల ఎత్తన ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. పూరిళ్లు పూర్తిగా ధ్వంసమవుతాయని, పక్కా ఇళ్లకూ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 9 లక్షల మందిని, ఒడిశా ప్రభుత్వం 2 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రకటించాయి. ఒడిశాలో జూన్ 1 నాటికి కాన్పు కావాల్సిన సుమారు 5 వేలమంది గర్భిణులను తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఆస్పత్రుల్లో చేర్చినట్టు వైద్యాధికారి ఒకరు తెలిపారు. జార్ఖండ్‌లోనూ తూర్పు, పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాల్లో అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, ఆక్సిజన్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని జార్ఖండ్‌లోని ఆస్పత్రులను ఆదేశించారు.
యాస్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మంగళవారం అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో రెండవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 45-55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు,మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఒడిశాకు గతంలో ఎన్నడూలేనంతగా అత్యధిక సంఖ్యలో బృందాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ పంపించింది. బంగాళాఖాతంలో తుఫానుల వల్ల ప్రభావితమయ్యే ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఏపీ, తమిళనాడు రాష్ర్టాలతోపాటు అండమాన్, నికోబార్ దీవుల్లో వినియోగించేందుకు 112 బృందాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ కేటాయించింది. అయితే, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ఒడిశాకు 52, బెంగాల్‌కు 45 బృందాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ పంపింది. మిగిలిన 15 బృందాలను మిగతా మూడు రాష్ర్టాలు, అండమాన్, నికోబార్ దీవులకు పంపినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 50 బృందాలనూ అవసరాన్ని బట్టి హెలికాప్టర్లలో ఈ రెండు రాష్ర్టాలకు రప్పించేందుకు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఒక్కో బృందంలో 47 మంది ఉంటారు. కూలిన చెట్లు, స్తంభాలు తొలగించేందుకు పరికరాలు, కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లు, గాలి పడవలు, ప్రాథమిక వైద్య పరికరాలూ బృందం వద్ద ఉంటాయి.
ఒడిశాలోని చాందీపూర్‌లో డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ)కు చెందిన ఐటీఆర్(ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్)తోపాటు, అబ్దుల్ కలాం దీవిలోనూ తుఫాను ప్రభావం చూపనున్నందున అక్కడ సురక్షిత చర్యలను డీఆర్‌డీవో చేపట్టింది. చాందీపూర్‌లో మూడు క్షిపణి ప్రయోగ వ్యవస్థలు(లాంచ్ ప్యాడ్‌లు), అబ్దుల్ కలాం దీవిలో ఓ ప్రయోగ భవనం, రెండు మిషన్ కంట్రోల్ రూమ్‌లు, బ్లాక్ హౌస్‌లు ఉన్నాయి. అయితే, గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులనూ తట్టుకునేలా కంట్రోల్ రూమ్, బ్లాక్ హౌస్‌లను నిర్మించారు. డీఆర్‌డీవో సన్నద్ధత మార్గదర్శకాల మేరకు అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని ఐటీఆర్ అధికార ప్రతినిధి మిలాన్ కుమార్ పాల్ చెప్పారు.

Share this on your social network: