టీడీపీ డిజిటల్ మహానాడు

టీడీపీ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. మా తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని గూడూరు ఎరిక్షన్ బాబు ప్రవేశపెట్టారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు పేరుతో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ఇవాళ, రేపు ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రత్యేక అనుమతులు తీసుకోవడం ద్వారా ఎనిమిది నుంచి పది వేల మంది ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో నమోదు చేసుకొని పాల్గొనేలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా మహానాడు సమావేశాలు నిర్వహించడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ విభాగాలకు కలిపి దీనిని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం పదిహేను తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో పది తీర్మానాలు ఆంధ్రప్రదేశ్... ఐదు తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి.
మహానాడులో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ సంక్షోభం-సమస్యల సుడిలో అన్నదాత, సంక్షేమానికి కోతలు- మారని బలహీనవర్గాల తలరాతలు, ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య-పరిశ్రమల మూసివేత, కొరవడిన మహిళా వికాసంపై పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

Share this on your social network: