సీఎం విజ్ఞప్తి చేసినా సమ్మె కొనసాగించిన జూనియర్ డాక్టర్లు

ఓవైపు కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుండగా.. జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ బుధవారం సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా కరోనాయేతర విఽధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి, టిమ్స్, ఎంఎన్‌జే, నిలోఫర్, కింగ్‌కోఠి, ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. ఉపకార వేతనాల పెంపును 2020 నుంచి అమలు చేయాలని, విధుల్లో ఉండి మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కరోనా బారిన సిబ్బంది కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఉచితంగా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు 15 శాతం వేతనపెంపు, కొవిడ్ సేవలకు 15 శాతం ఇన్సెంటివ్ అమలు చేయాలని అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే గురువారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్న సమయంలో జూనియర్ డాకర్లు సమ్మెకు దిగడంతో ఆయా ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
సీఎం ఆదేశంతో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) రమేశ్‌రెడ్డి.. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. కానీ, ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ లభించలేదని సమావేశం అనంతరం జూడాలు తెలిపారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తే విధుల్లో చేరుతామని ‘ఆంఽధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతానికి సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. కరోనా మృతులకు పరిహారం ఇవ్వబోమని, కొవిడ్ సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్‌లో బెడ్‌లు ఇచ్చే అంశం లేదని చెప్పడంతోపాటు 10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్‌లు ఇవ్వడం కుదరదని డీఎంఈ చెప్పినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. అయితే జూనియర్ డాక్టర్ల డిమాండ్లు న్యాయమైనవి అయితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మె చేపట్టడం మంచిది కాదని, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. కానీ, మంత్రి కేటీఆర్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు విషయాన్ని జటిలం చేశాయన్న అభిప్రాయాన్ని జూనియర్ డాక్టర్లు వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని, సమ్మెను విరమించకపోతే తదుపరి చర్యలుంటాయని ఆయన హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జూడాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Share this on your social network: