కొవిడ్ మృతుల పిల్లలకు కేంద్రం బాసట

కరోనా మహమ్మారి కుటుంబాలనే ఛిద్రం చేస్తోంది. కొవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకుని, ఎందరో బాలలు అనాథలవుతున్నారు. అలాంటి వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే.. పీఎం కేర్స్ పేరుతో సేకరించిన కొవిడ్-19 నిధులు వారికి ఆసరానివ్వనున్నాయి. కొవిడ్ వల్ల అనాథలుగా మారుతున్న చిన్నారుల భవిష్యత్‌పై ఇటీవల ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. అనాథలుగా మారుతున్న చిన్నారులను పీఎం కేర్స్ ద్వారా ఆదుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేశారు.
వీటి ప్రకారం.. తల్లిదండ్రులను కరోనా కాటేయడంతో అనాథలైన ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తారు. వారి చదువులు పూర్తయ్యేదాకా ఉచిత విద్యను అందజేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇలాంటి పిల్లలకు ఆర్థికసాయాన్ని ప్రకటించగా.. పీఎం-కేర్స్ ద్వారా అందించే సాయం అందుకు అదనం.
అనాథలైన చిన్నారులు పెద్దయ్యేకొద్దీ.. కార్పస్ ఫండ్‌గా ఉండే రూ. 10 లక్షల మూలంగా లబ్ధి పొందుతారు. వారు పెద్దయ్యాక.. 18-23 ఏళ్ల మధ్య నెలకు కొంత మొత్తంలో స్టైఫండ్‌గా అందజేస్తారు. వారికి 23 ఏళ్ల వయసు వచ్చాక.. కార్ప్‌సఫండ్ మొత్తాన్ని సొంత అవసరాలకు లేదా ఉపాధి కోసం వాడుకోవచ్చు. ఇలాంటి చిన్నారులకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందజేస్తారు. వారికి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం కల్పిస్తారు. ఒకవేళ ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నట్లయితే.. విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ)లో పేర్కొన్న మేర ఫీజులను పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు.
దీంతోపాటు.. యూనిఫారాలు, పుస్తకాలకు నిధులు అందజేస్తారు. ప్రాథమికోన్నత విద్యనూ ఉచితంగా అందజేస్తారు. నవోదయ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, సైనిక్ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తారు. సంరక్షకుల వద్ద ఉంటూ ప్రైవేటు స్కూళ్లలో చదువుకునేవారికి ఫీజు చెల్లిస్తారు. పుస్తకాలు, యూనిఫారాలను అందజేస్తారు. ప్రొఫెషనల్ కోర్సులు, ఉన్నత విద్యను అభ్యసించేవారికి స్కాలర్‌షిప్పులిస్తారు.
దురదృష్టవశాత్తూ ఎందరో పిల్లలు కరోనా మహమ్మారి కారణంగా అనాథలవుతున్నారు. వారంతా రేపటి పౌరులు. రేపటి దేశ భవిష్యత్తు వారే. అలాంటి వారిని ఆదుకోవడం మన కర్తవ్యం. ఈ సమాజ బాధ్యత. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే పీఎం కేర్స్ ఫండ్‌ను వినియోగిస్తున్నాం. వారి భవిష్యత్‌కు బంగారు బాటలు పరుస్తున్నాం.

Share this on your social network: