అధికారులకు సీఎం ఆదేశం.. కరోనా కట్టడిపై సమీక్ష

Published: Sunday May 30, 2021

 రాష్ట్ర ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తోందో ఆలోచించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడ, రాజమహేంద్రి, తిరుపతి కార్పొరేషన్లు సహా ప్రతి జిల్లా కేంద్రంలోనూ హెల్త్‌ హబ్‌లు ఉండాలని.. రాష్ట్రం మొత్తమ్మీద 16 హెల్త్‌ హబ్‌లు నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఒక్కో హెల్త్‌ క్లబ్‌కు కనీసం 30 నుంచి 50 ఎకరాల భూమిని సేకరించాలని.. మూడేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ఆస్పత్రులకు భూములు కేటాయించాలని నిర్దేశించారు. శుక్రవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా కట్టడి, ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్‌ సరఫరా , కర్ఫ్యూ పొడిగింపు తదితర అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు వస్తున్నాయని..ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలోనూ మంచి ఆస్పత్రులు వస్తాయని తెలిపారు. 80కి పైగా మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వచ్చే అవకాశముందని.. దీనివల్ల వైద్యం కోసం రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి వైద్యం అందుతుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ తయారయ్యేలా ఒక విధానం తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. 

ఆనందయ్య మందుపై సోమవారంలోగా తుది రిపోర్టు వస్తుందని ఆయుష్‌ కమిషనర్‌ రాములు చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన ప్రత్యేక సమీక్షలో ఆయన పాల్గొన్నారు. మందు పంపిణీపై ఆనందయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని.. కోర్టు ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసిందని.. ఆలోపు ఆ మందు చివరి రిపోర్టు వస్తుందని భావిస్తున్నామని రాములు చెప్పారు. కేంద్ర బృందాల నివేదిక శనివారం రావొచ్చన్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.