కంట్లో చుక్కలు వద్దు.. ‘పీ, ఎల్, ఎఫ్’ నోటి మందులకు అనుమతి

కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందు పంపిణీకి లైన్ క్లియర్ అయింది. అయితే కంట్లో వేసే మందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నోటి ద్వారా ఇచ్చే ‘పీ’, ‘ఎల్’, ‘ఎఫ్’ అనే మూడు మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య మందు కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రజల్లో విశ్వాసం పెరగడంతో దాని కోసం పలు జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేల మంది కృష్ణపట్నం వైపు పరుగులు తీశారు. జనంలోకి రాకూడదన్న నిబంధనను గాలికొదిలేసి.. అనేక మంది బాధితులు ఆస్పత్రుల నుంచి కూడా బయటకు వచ్చేసి.. అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు సహా తరలివెళ్లడం.. ఆనందయ్య మందుకు డిమాండ్, రద్దీ కూడా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసి.. దానిలోని శాస్త్రీయతను తెలుసుకునేందుకు సీసీఆర్‌ఏఎస్ సహా పలు సంస్థల నివేదికను ఆయుష్ కమిషనర్ వి.రాములు ద్వారా తెప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఆనందయ్య మందును పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష జరిపారు. ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ నోటి మందుకు ఈ సందర్భంగా ఆమోదముద్ర వేశారు.
ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతున్నట్లుగా నిర్ధారణ కాలేదని సీసీఆర్‌ఏఎస్ నివేదిక తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆనందయ్య మందు వాడుతూనే.. మిగిలిన మందులనూ వాడాలని ప్రజలకు సీఎం సూచించారు. కంట్లో వేసే మందు విషయంలో మరిన్ని నివేదికలు రావలసి ఉందని.. ఇందుకు మరో రెండు మూడు వారాలు పట్టవచ్చని.. కే అనే మందును కమిటీకి ఆనందయ్య చూపించలేదని అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో.. కంట్లో మందును ఇవ్వొద్దని ఆనందయ్యకు సూచించాలని ఆయన ఆదేశించారు. అయితే.. ఆనందయ్య మందు కోసం బారులు తీరవద్దని.. కొవిడ్ ఆంక్షలు పాటించాలని కోరారు. మందు కోసం కరోనా బాధితులు అక్కడకు వెళ్లరాదని.. బారి బంధువుల ద్వారా మందును సేకరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.
ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఎఎస్ క్లినికల్ ట్రయల్స్ చేసిందని.. దానివల్ల కొవిడ్ తగ్గినట్లుగా ఎలాంటి నిర్ధారణలు లేవని నివేదికల స్పష్టం చేశాయని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. కాకపోతే మందు తయారీలో వాడే పదార్ధాల వల్ల ఎలాంటి హానీ లేదని నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అలాగే ఇది ఆయుర్వేద ఔషధమని గుర్తించడానికి కూడా వీల్లేదని చెప్పారు. ఆనందయ్య ఆయుర్వేదం మందుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేస్తే దానిని చట్ట పరిధిలో పరిశీలిస్తామన్నారు. ముడిపదార్ధాలు లేనందున కె అనే మందు తయారీని కమిటీకి చూపించలేదని తెలిపారు. కంటి డ్రాప్స్‌పై పూర్తి నిర్ధారణ రావాలన్నారు. సీసీఆర్‌ఏఎస్ ఇచ్చిన నివేదికలను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. దీంతో కంట్లో వేసే డ్రాప్స్ తప్ప.. ఆనందయ్య ఇస్తున్న ఇతర మందులకు ఆయన ఆమోదముద్ర వేశారు.

Share this on your social network: