డెత్ సర్టిఫికెట్ల కోసం కరోనా మృతుల కుటుంబ సభ్యుల పాట్లు

కరోనా కల్లోలం రేపిన కుటుంబాల్లో చితిమంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఆయా కుటుంబాల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన ప్రభుత్వ సిబ్బంది మరింత ఇబ్బంది పెడుతున్నారు. మరణానంతరం ఇవ్వాల్సిన ధ్రువపత్రాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఏ విషయమూ స్పష్టంగా చెప్పకుండా ఒకే పని కోసం పదిసార్లు తిప్పుకుంటున్నారు.
కుటుంబ జీవనాధారం, ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయామనే బాధలో వున్నవారికి ప్రభుత్వం, బీమా సంస్థల నుంచి కొన్ని రకాల సాయం అందాల్సి ఉంటుంది. వాటి కోసం ధ్రువపత్రాలు తప్పనిసరి. ఆయా కార్యాలయాల్లో సిబ్బంది నిర్లక్ష్యం, తీవ్ర జాప్యం కారణంగా నెల రోజులైనా పత్రాలు చేతికి అందక, సాయం కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.
కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేజీహెచ్, విమ్స్‌లలో ఎవరైనా చనిపోతే, అక్కడే ధ్రువపత్రం ఇస్తున్నారు. అక్కడి ఆర్‌ఎంఓలు ఈ బాధ్యతలు చూస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోతే, అది జీవీఎంసీ ఏ జోన్ పరిధిలోకి వస్తుందో అక్కడ దరఖాస్తు చేసుకోవాలి.
ఏ ఆస్పత్రిలో చనిపోయినా, శవాన్ని అంతిమ సంస్కారానికి తీసుకువెళ్లే ముందు ఒక లెటర్ ఇస్తారు. ఫలానా తేదీన ఆస్పత్రిలో చేరారని, ఫలానా రోజున, ఫలానా కారణంతో చనిపోయారని అందులో రాస్తారు. దానిని తీసుకువెళ్లి జ్ఞానాపురం (ఇంకా ఏ ఇతర) శ్మశాన వాటికలో ఇస్తే..నమోదు చేసుకొని దహనం చేస్తారు. వారం, పది రోజులు తరువాత అక్కడికి వెళితే...వారొక సర్టిఫికెట్ ఇస్తారు. దానిని తీసుకొని జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి, దరఖాస్తు నింపి అందజేయాలి. 21 రోజుల్లో డెత్ సర్టిఫికెట్ జారీచేస్తారు. అలా కాకుండా శ్మశానంలో ఇచ్చిన సర్టిఫికెట్‌ను తీసుకొని, దరఖాస్తుదారు నివాసం వుండే ప్రాంతంలో గల సచివాలయంలో గానీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. వారు అన్నీ పరిశీలించి 21 రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి. కేజీహెచ్, విమ్స్‌లలో అయితే శ్మశానంలో ఇచ్చిన సర్టిఫికెట్ చూపించి, ప్రత్యేకంగా దరఖాస్తు రాసి ఇస్తే...రెండు, మూడు రోజుల్లో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
నిబంధనలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయాల్సిన సిబ్బందే తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కేజీహెచ్, విమ్స్‌లలో ఒకటి, రెండు రోజుల్లో అయిపోవలసిన పనికి వారాల తరబడి తిప్పుతున్నారు. కేజీహెచ్ స్పెషల్ వార్డులో ఈ బాధ్యతలు చూస్తున్న సిబ్బంది...దరఖాస్తుదారులను ఆధార్ కావాలి, మీరు దరఖాస్తు చేయకూడదు, చనిపోయిన వారి భార్యే రావాలి...అంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. అన్నీ ఇచ్చాక వారం తరువాత రమ్మంటున్నారు. విమ్స్‌లోను దాదాపుగా ఇదే పరిస్థితి.
ఇక ప్రైవేటు ఆస్పత్రులైతే...తమ వద్ద చనిపోయిన వారి వివరాలను జీవీఎంసీకి వెంట వెంటనే పంపడం లేదు. సచివాలయంలో దరఖాస్తు చేస్తే...‘మీ రిపోర్ట్ ఇంకా ఆస్పత్రి నుంచి రాలేదు’ అని చెబుతున్నారు. అలాగే జ్ఞానాపురం శ్మశానవాటికలో అంతిమ సంస్కారం సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా మళ్లీ మళ్లీ వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి ఎన్నిసార్లు వెళితే...అంత ఖర్చు. చేయి తడిపితే గానీ పని జరగడం లేదు.
ప్రభుత్వం, బీమా సంస్థల నుంచి పరిహారం పొందాలంటే...కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్టిఫికెట్ అవసరం. దానిని తహసీల్దార్ జారీచేస్తారు. రెవెన్యూ కార్యాలయాల్లో వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు సాధారణ రోజుల్లో అయితే సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత చెట్టు కిందన కూర్చొని సర్టిఫికెట్లకు బేరాలు ఆడుతుంటారు. ఇప్పుడు కర్ఫ్యూ వల్ల సాయంత్రం సెటిల్‌మెంట్లు లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల్లోపు వారిని పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. ‘మాట్లాడుకుంటే’ తప్ప పని జరగకపోవడంతో కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. నగరం, చుట్టుపక్కల గల కొన్ని కార్యాలయాల్లో తహసీల్దార్ల వ్యవహార శైలికి ఉన్నతాధికారులు సైతం భయపడుతున్నారు. వారిని ఏమైనా అంటే...తిరిగి కేసు పెడతామని బెదిరిస్తుంటారని, ఏమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. దీనిపై జిల్లా ముఖ్య అధికారులు దృష్టి పెట్టి, గట్టి హెచ్చరిక చేస్తే తప్ప వ్యవహారం గాడిన పడేలా లేదు.

Share this on your social network: