కోస్తాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు

కోస్తాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు దంచికొట్టాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. దక్షిణ ఛత్తీ్‌సగఢ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడ్డాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 154 ప్రాంతాల్లో 15.5 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షం కురిసిందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. కృష్ణా జిల్లా నూజివీడులో అత్యధికంగా 122.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో ప్రధాన రహదారులన్నీ జలమయం కావటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులు హోరెత్తించాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మామిడి, అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుపాం మండలంలో పిడుగు పడి ఐదు ఎద్దులు మరణించగా, 15 ఆవులు గాయపడ్డాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దుక్కి దున్నుతుండగా పిడుగుపడి... కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, ఓ బాలిక గాయపడింది. 9 గొర్రెలు మృతి చెందాయి. జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముస్తాబాద పంట పొలాల్లో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా పిడుగుపడటంతో డ్రైవర్ రెడ్డి నరసింహారావు(30) అక్కడికక్కడే మృతి చెందాడు. ముసునూరులో పిడుగుపాటుకు గురై కొప్పుల హరికృష్ణ(13) మృతి చెందాడు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామానగరంలో భవనంపై పిడుగు పడటంతో ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. నూజివీడు మండలం యనమదల గ్రామ శివారు రేగుంటలో పిడుగు పడటంతో 9 గొర్రెలు మృతిచెందాయి.
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ఆవరించాయి. సముద్రం మీదుగా బలమైన పడమర గాలులు కేరళ దిశగా వీస్తున్నాయి. కేరళ నుంచి కొంకణ్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో కేరళలోకి నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Share this on your social network: