పక్కా ఇళ్ల నిధులు దాదాపు కేంద్రానివే

Published: Friday June 04, 2021

28 లక్షల ఇళ్లు! రూ.50వేలకోట్లు! రాష్ట్రంలోని పేదల కోసం వైసీపీ సర్కారు కట్టిస్తున్నానని ప్రచారం చేసుకొంటున్న ఇళ్ల సంఖ్యా..అందుకయ్యే ఖర్చుల లెక్కలివి! పైకి ఈ అంకెలు ఘనంగా, పేదలకు జరిగే గొప్ప మేలుకు సూచికల్లా ఉన్నాయి. కానీ పొట్ట విప్పిచూస్తే అన్నీ ఆర్భాటాలే! పక్కా ఇళ్లకు ఇచ్చే రాయితీలో సింహాభాగం కేంద్ర పథకాల ద్వారానే పేదలకు అందనుంది. ఇంటిపై రూపాయి పెడితే పావలా కూడా రాష్ట్రం వాటా లేదు. అంటే..పెట్టేది ‘గోరంత’! ప్రచారం మాత్రం ‘కొండంత’! కేంద్రం నుంచి ‘పక్కా’గా నిధులు తెచ్చుకుని దానికి వైసీపీ రంగులు వేస్తున్నారన్నమాట! రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షల పైచిలుకు ఇళ్లకు గురువారం రెండోసారి శంకుస్థాపన చేసింది. ఇందులో తొలిదశలో 17.60లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. ఈ ఇళ్లన్నీ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో అనుసంధానం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పీఎంఏవైలో పూర్తిస్థాయి గ్రామీణ ప్రాంతాలు మినహా నిర్మించే ఇళ్లన్నింటికీ.. కేంద్రం రూ.1.50 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. నగరాలు, పట్టణాలతో పాటు యూడీఏల పరిధిలో నిర్మించే ఇళ్లన్నింటికీ ఈ రాయితీ వర్తిస్తుంది.

 

కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి పీఎంఏవై(గ్రామీణ్‌), పీఎంఏవై(అర్బన్‌) పథకాల కింద సుమారు రూ.18 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. అందులో అతి కొద్ది సంఖ్య తప్ప దాదాపు ఇళ్లన్నీ పీఎంఏవై అర్బన్‌ పరిధిలోనే ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తొలిదశ కింద చేపట్టిన 15.60 లక్షల ఇళ్లన్నీ అర్బన్‌ పరిధిలోకే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఇచ్చే రాయితీని రూ.1.80 లక్షలుగా నిర్ణయించింది. అందులో రూ.1.50 లక్ష కేంద్రం రాయితీ పోతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే భరిస్తోంది. అందులోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ఇళ్లకు మాత్రమే ఆ రూ.30 వేలయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన యూడీఏల్లోని ఇళ్లకు ఉపాధి హామీ నిధులను రాయితీ కింద అనుసంధానిస్తారు. అంటే యూడీఏల్లో నిర్మించే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఇవ్వదు.

రెండు దశల్లో చేపట్టబోయే 28లక్షల ఇళ్లల్లో పూర్తిగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఐదు లక్షలకు మించి ఉండే అవకాశం లేదు. కేవలం ఆ 5 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.30 వేలు చొప్పున అంటే మొత్తం కలిపినా రూ.1500 కోట్లు మించి రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడే అవకాశం లేదు. మిగిలిన నిధులన్నీ అటు రాయితీల రూపంలోగానీ, ఇటు ఉపాధి నిధుల అనుసంధాన రూపంలో గానీ కేంద్రం నుంచే వచ్చేవే. అయినా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నట్లే కలరింగ్‌ ఇస్తున్నారు. ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న 28 లక్షల ఇళ్లను నిర్మించాలంటే 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా సొంత నిధులతో నిర్మించాల్సి ఉంటుంది. కానీ వాటిని కూడా కేంద్రం మంజూరుచేసే ఇళ్ల కిందే చేపట్టాలని ప్రభుత్వ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎలాగూ తొలిదశ ఇళ్లకు మరోఏడాది గడవు ఉంది. ఆ తర్వాత అయినా మిగతా ఇళ్లను కూడా కేంద్రం మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అంతే తప్ప సొంతంగా నిధులు వెచ్చించి ఇళ్లు నిర్మించాలనే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం కనిపించడం లేదు. 

గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే అదనపు లబ్ధి పేదల ఇళ్లకు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో ఆ హామీనుంచి వెనకడుగు వేసింది. గత ప్రభుత్వంలోఎస్సీ,ఎస్టీలకు రూ.2.50 లక్షలు, ఇతరులకు రూ.రెండు లక్షల చొప్పున రాయితీ ఇచ్చారు. వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. తీరా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇవ్వకపోగా, అసలుకే కోత పెట్టింది. సరాసరిన అన్నీ వర్గాలవారికి ఒకే విధంగా రూ.1.80 లక్షలను రాయితీగా నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఎస్సీ,ఎస్టీలు రూ.70 వేలు, ఇతరులు రూ.50 వేలు ఒక్కో ఇంటిపై రాయితీలు కోల్పోయినట్లయింది. 

ఆదాయం లేదంటూ వైసీపీ ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోతోంది. అదేసమయంలో రూ.26,690 కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్భాటాలు చేస్తోంది. ఈ నిధులతో తాగునీరు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలోని జగనన్న కాలనీల్లో ఇప్పటివరకు ఏ కాలనీలోనూ సగంకూడా మౌలిక సదుపాయాలకల్పన పూర్తి కాలేదు. ఇవి పూర్తయితేగానీ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం లేదని చెబుతున్నారు.