సెకండ్ వేవ్‌కు ముగింపు ఎప్పుడు.

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ పోకడలను అంచనా వేయడం నిపుణులకు కూడా తలనొప్పిగా మారింది. ఇది ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీప్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతానికైతే ఇది పెరుగుతోంది. గతేడాదిలా కొన్ని రాష్ట్రాలకే వైరస్ పరిమితం కాలేదు. భారత్ మొత్తం దీని ప్రభావం ఉంది’’అని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివిటీ రేటు 21శాతం. ఇది 5శాతం కన్నా తగ్గితే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు. ఇలా ఎప్పుడు జరుగుతుందో అంచనా వేస్తే కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో ఊహించవచ్చనేది నిపుణుల మాట. ఈ పాజిటివిటీ రేటు తగ్గాలంటే వేరే మార్గమేమీ లేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించడం, శానిటైజేషన్, సామాజిక దూరం.. ఇవే పాజిటివిటీ రేటును తగ్గించడానికి మార్గాలు. మనకన్నా ముందు సెకండ్ వేవ్ ఎదుర్కొన్న అమెరికా, ఇంగ్లండ్ దేశాల నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఇవే.
కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందని కొన్ని గణిత శాస్త్ర విధానాల ప్రకారం అంచనాలు వేస్తే ఒక విషయం తెలిసింది. మే నెల మధ్యలో కరోనా పీక్స్ (అత్యున్నత స్థాయి) చేరుకుందని ఈ అంచనాలు పేర్కొన్నాయి. మరో 1-2 నెలలు పడితేగానీ ఈ ఉధృతి తగ్గదని, ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితి మెరుగవుతుందని నిపుణులు అంచనాలు వేశారు. ఎంత చేసినా ఇవి లెక్కలే. ప్రస్తుతం మన దేశంలో కరోనా వేవ్ స్థిరమైన స్థాయిలో ఉందా? లేక పెరుగుతుందా? తగ్గుతుందా? అనేదే సరిగ్గా అంచనా వేయలేని స్థితిలో ఈ లెక్కలను ఎంత వరకూ నమ్మవచ్చనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం ఈ మహమ్మారిని నియంత్రించి, దేశ వైద్యవ్యవస్థపై భారం తగ్గించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అయితే వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగడం వల్ల కరోనా సెకండ్ వేవ్ ముగింపు ప్రశ్నార్థకంగా మారింది.
దేశంలో కరోనా ట్రెండ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, బిహార్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గడం కొంత ఊరటనిస్తోంది. అయితే కరోనా మరణాల రేటు మాత్రం చెప్పుకునే స్థాయిలో తగ్గలేదు. ఇక్కడ మరో తీవ్రమైన సమస్య.. కరోనా మరణాల విషయంలో చాలా రాష్ట్రాలు నిజాలు దాస్తున్నాయనే ఆరోపణ. కొన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టులు కూడా తక్కువగా చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగడం మొదలైంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుంది? అని సామాన్యుడు అడిగే ప్రశ్నకు ఎవరి వద్దా సరైన సమాధానం లేకుండా పోయింది.

Share this on your social network: