పెట్రోల్‌లో 20% ఇథనాల్... 2025 నాటికే దేశమంతా అమలు

పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను కలిపేందుకు విధించిన గడువును ప్రధాని మోదీ ఐదేళ్లు తగ్గించారు. చెరకు, నూకలు, పాడైన గోధుమలు, ఇతర ఆహారధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసే ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గడంతోపాటు, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం ఇథనాల్‌పై కార్యాచరణ 2020-2025ను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ రెండూ కొనసాగాలి. భారత్ ఎంచుకున్న మార్గం ఇదే’ అన్నారు. 2022 నాటికి పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలపాలని, 2030 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని గతేడాది ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. వాతావరణ మార్పులపై భారతదేశం కృషిని మోదీ ప్రస్తావిస్తూ.. దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 250 శాతం పెరిగిందని, ఈ విషయంలో టాప్-5 దేశాల్లో భారత్ నిలిచిందని తెలిపారు.
‘ఇప్పుడు వాతావరణ మార్పులపై తీర్మానాన్ని భారత్ ప్రతిపాదిస్తోంది. వాతావరణ మార్పు పనితీరు సూచికలోని టాప్ 10 దేశాలలో భారత్ కూడా ఉంది’ అన్నారు. ఇథనాల్ సేకరణ ఎనిమిది రెట్లు పెరగడంతో దేశంలోని చెరకు రైతులకు మేలు జరిగిందన్నారు. ఐక్యతా విగ్రహం ఉన్న గుజరాత్‌లోని కెవడియాను విద్యుత్ వాహనాల నగరంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రధాని చెప్పారు. దీంతో భవిష్యత్తులో అక్కడ ద్విచక్ర వాహనాల నుంచి బస్సుల వరకూ అన్నీ బ్యాటరీతోనే నడుస్తాయన్నారు. కాగా పుణెలోని 3 ప్రాంతాల్లో ఈ-100(వంద శాతం ఇథనాల్) పంపిణీ స్టేషన్లను పైలట్ ప్రాజెక్టుగా మోదీ ప్రారంభించారు.

Share this on your social network: