తొమ్మిదేళ్ల క్రితమే కరోనా వ్యాప్తికి బీజాలు

చైనాలో కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మరో కీలక రహస్యాన్ని భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. 2012లోనే దక్షిణ చైనాలోని మొజియాంగ్ రాగి గని కేంద్రంగా కరోనా కుటుంబానికి చెందిన వైరస్ మనుషులకు వ్యాపించడం మొదలైందని వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన సైంటిస్టు దంపతులు డాక్టర్ మనోలి రహాల్కర్, డాక్టర్ రాహుల్ బహుళీకర్‌లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనాను లక్షణాలపరంగా పోలి ఉండే ‘ఆర్‌ఏటీజీ 13’ బీటా కరోనా వైర్‌సపై అధ్యయనం జరుపుతుండగా ఈవిషయాన్ని గుర్తించారు. ఇది హార్స్ షూ రకం గబ్బిలాలకు ఎక్కువగా సోకుతుంటుందని తెలుసుకున్న శాస్త్రవేత్తలు, గబ్బిలాల నుంచి మనుషులకు అది ప్రబలిన ఘటనల వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 2012లో మొజియాంగ్ గనిలోపల ఉండే గబ్బిలాలకు ‘ఆర్‌ఏటీజీ 13’ రకం బీటా కరోనా వైరస్ సోకిందని, వాటి మల, మూత్రాలతో నిండిపోయిన గనిని శుభ్రం చేసే క్రమంలో అది గాలి ద్వారా కార్మికులకు సోకిందని గుర్తించారు. అచ్చం కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వారి తరహాలోనే.. ఆ ఆరుగురిలోనూ అప్పట్లో జ్వరం, దగ్గు, రక్తం గడ్డకట్టడం, నీరసం, న్యుమోనియా, పల్మనరీ త్రాంబో ఎంబాలిజం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు. ‘చైనా కరోనా డాక్టర్’గా పేరొందిన పల్మనాలజిస్టు జోంగ్ నన్షన్ స్వయంగా గని కార్మికులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరిశీలించి, వారికి సోకింది వైరల్ ఇన్ఫెక్షనే అని ధ్రువీకరించారని వివరించారు. దీంతో వారికి యాంటీ వైరల్ యాంటీ బయోటిక్ ఔషధాలతో చికిత్స కొనసాగిందన్నారు. ఈక్రమంలో పలువురిలో వైరల్ ఇన్ఫెక్షన్‌కు అదనంగా.. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా బయటపడిందన్నారు. చివరకు ముగ్గురు గని కార్మికులు మృతి చెందారని చెప్పారు. నాడు ఆ కార్మికులకు చేసిన రేడియోలాజికల్, సీటీ స్కాన్ పరీక్షా నివేదికల ఫలితాలు..ఇప్పటి కరోనా రోగుల ఇన్ఫెక్షన్ లక్షణాలకు పోలినట్టే ఉన్నాయన్నారు. ఈమేరకు వివరాలతో డాక్టర్ మనోలి రహాల్కర్, డాక్టర్ రాహుల్ బహుళీకర్ దంపతులు రూపొందించిన పరిశోధనా పత్రం 2020 మే నెలలో ఓ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Share this on your social network: