బీజేపీ నాయకత్వానికి ప్రధాని మోదీ సూచన

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర విజయాలు ఎందుకు సాధించలేదో విశ్లేషించుకోవాలని ప్రధాని మోదీ బీజేపీ జాతీయ నాయకత్వానికి సూచించారు. గెలుపోటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలని అన్నారు. తదుపరి జరగనున్న ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీకి కీలకమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పనితీరు, కొవిడ్ సెకండ్ వేవ్‌లో ప్రజలను ఆదుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలపై రెండు రోజుల సమీక్ష ఆదివారం ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఈ సమీక్ష నిర్వహించారు. అనంతరం సాయంత్రం ప్రధాని అధికార నివాసానికి వెళ్లి మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా సమావేశమైన ప్రధాని.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

Share this on your social network: