ఆనందయ్య మందు పంపిణీకి సహకరించని సర్కారు

Published: Wednesday June 09, 2021

కరోనా నివారణా ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఆనందయ్య మందును అందుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు! ఉచితంగా తయారుచేసి పంచడానికి ఆనందయ్య సైతం తన సంసిద్ధతను ఇప్పటికే తెలిపారు. ‘ఆనందయ్య మందును అడ్డుకోవద్దు’ అని హైకోర్టు కూడా ఆదేశించింది. ‘హానికరం కాదు...పంచొచ్చు’ అని కోర్టుకు స్వయంగా ప్రభుత్వం తెలిపింది. అయినా.. ఇంత తతంగం, ఎంతో ప్రయాస తర్వాత కూడా ఆనందయ్య కోరుకొన్నట్టు ఆయన మందు పంపిణీ ఇంకా ప్రారంభమే కాలేదు. మందు తయారీకి ప్రజల నుంచే కాదు.. ప్రభుత్వం నుంచీ ఆనందయ్య పైసా ఆశించడం లేదు. తయారీచేసిన తన మందు బాధితుల దాకా చేర్చడానికి పంపిణీలో సాయం అందించాలని మాత్రమే ఆయన కోరుతున్నారు. అయినా..ప్రభుత్వం పక్షాన ఒక్క అధికారి కూడా ఆనందయ్యను సంప్రదించిందే లేదు. అలాగని ఆనందయ్య మందు తయారీ ఆగిందా? అంటే.. అదీ లేదు. వైసీపీ నేతలు కొందరు అది ‘మా మందే’ అన్నట్టు తమ ఫొటోలు ముద్రించుకొని మరీ తమ నియోజకవర్గాల్లో పంచుతున్నారు. ఆనందయ్యతో లక్షలప్యాకెట్ల మందు కలిపించుకొంటూ.. జనంలో వైసీపీ కలరింగ్‌ ఇస్తున్నారు. ఇవన్నీ కలిసి ఆనందయ్యను..ఆయన మందుకి దూరంచేసే పరిస్థితికి తెచ్చాయి. ‘‘ఉచితంగా మందు తయారుచేసిఇస్తా..తీసుకెళ్లి పంచుకోండి’’ అని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆనందయ్య ఆవేదనతో లేఖలు రాశారు.  

 

హైకోర్టు ఆదేశాలుజారీ చేసిన తర్వాతే ఆనందయ్య మందుకు మోక్షం లభించిందన్న విషయాన్ని అధికార నేతలు కావాలనే మరుగున పెట్టేశారు. ‘అంతా జననన్న దయ’ అంటూ ఊరూవాడా చెప్పుకొంటున్నారు. తమ రాజకీయ లబ్ధికోసం సొంత నియోజకవర్గాల్లో ఇంటింటికి పప్పు బెల్లాల్లా మందును పంచిపెడుతున్నారు. మందు తయారు చేసిన ఆనందయ్యను పక్కకు నెట్టి.. ప్యాకెట్ల మీద జగన్‌రెడ్డి, అధికార ఎమ్మెల్యేల ఫొటోలతో పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యను ఈరోజు ఒక నేత తీసుకెళితే.. మరునాడు మరో నేత వెంటతీసుకెళ్లి మందు కలిపించుకొంటున్నారు. ఈ నాయకులను దాటుకొని ఆనందయ్య తన మందు కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలను చేరుకునే రోజు ఇప్పట్లో కనిపించడం లేదు. మరోవైపు, ఆనందయ్య మందు అన్ని ప్రాంతాల్లో అందేలా చర్యలు తీసుకొంటామని ప్రకటించిన అధికారగణం.. ఆ మాట మరిచినట్లు నటిస్తోంది. ఉచితంగా మందులు ఇస్తాం.. తీసుకెళ్లండి అని ఆనందయ్య వెంటపడుతున్నా అధికార యంత్రాంగంలో స్పందన లేదు. 

 

ఔషధం అది ఏదైనా అందరికీ దక్కాలి. ఆనందయ్య ఆశయం, లక్ష్యం కూడా అదే. అయితే ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడం లేదు. హైకోర్టు, ప్రభుత్వ అనుమతుల క్రమంలో ఆనందయ్య మందులు పంపిణీ చేస్తారని పది రోజులుగా ఎదురుచూస్తున్న కరోనా బాధితులకు నిరాశే మిగిలింది. ఆనందయ్య మందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చిన రెండు రోజుల తరువాత నెల్లూరు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన మందుల పంపిణీకి సంబంధించి సమావేశం జరిగింది. ఆన్‌లైన్‌, యాప్‌, పోస్ట ల్‌.. ఇలా అన్ని మార్గాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఈ భేటీ అనంతరం కలెక్టర్‌ మీడియాకు తెలిపారు. జిల్లా ల్లో మందుపంచే బాధ్యత కలెక్టర్లు తీసుకొంటారని కూడా చెప్పారు.  కానీ, నెల్లూరు సహా ఏ జిల్లా కలెక్టరూ.. తమ జిల్లాలకు మం దు కావాలని ఇంతవరకు కోరలేదని ఆనందయ్య ఆవేదన వ్యక్త ం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మందుల పంపిణీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆనందయ్య మందు అధికార నేతలకు తప్ప ప్రజలకు చిక్కకుండా చేయడమే ఈ ‘ఉదాసీనత’ ఉద్దేశమని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి.

 

ఆనందయ్య సొంత జిల్లా నెల్లూరులో తొమ్మిది వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంపై లక్షకుపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో ఉన్నారు. వీరందరికీ అత్యవసరంగా కే, ఎఫ్‌, ఎల్‌ మందు అందాలి. కే మందుకు తాజాగా హైకోర్టు అనుమతి కూడా లభించింది. అయినా.. ఈ మూడు మందులను వదిలేసి ‘పీ’ మందునే నేతలు ఆనందయ్యతో తయారుచేయిస్తున్నారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచే సాధారణ మందు. కరోనాబారిన పడనివారు, వైరస్‌ బారిన పడి కోలుకొని మామూలు మనుషులు అయిన వారికి ఈ మందు వాడతారు. ఈ మందు అత్యవసరంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా.. పట్టుబట్టి ఈ మందునే ఆనందయ్య, ఆయన కుమారునితో చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సర్వేపల్లిలో శాసనసభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి తయారుచేసి పంపిణీకి పెట్టారు. ఎందుకు? ఎవరైనా వాడుకొనే వీలుండటంతో ఇంటింటి పంపిణీకి ‘పీ’యే అనుకూలమని అధికార నేతలు భావిస్తుండటమే దీనికికారణమని చెబుతున్నారు. 

 

కరోనా కారణంగా మృత్యువుతో పోరాడుతున్న వారికి చేతనైన సేవ చేయాలనేది ఆనందయ్య ఆశయం. కృష్ణపట్నంలో ఆనందయ్య స్వతంత్రంగా మందులు ఇచ్చే సమయంలో ఎంతో మంది కరోనా బాధితులకు నేరుగా మందు అందజేసేవారు. కొనఊపిరితో వచ్చినవారు తన మందుతో లేచి కూర్చున్న సంఘటనలు ఆయనకు ఎంతో తృప్తిని ఇచ్చేవి. కాని ఇప్పుడు ఆయన తయారు చేస్తున్న లక్షల పాకెట్లు ఎవరికి  ఉపయోగపడుతున్నాయో, ఎవరి ప్రాణాలు కాపాడుతున్నాయో లేదో కూడా ఆయనకు తెలియని పరిస్థితి!