కరోనాపై పోరులో రాష్ట్రంలో 45 మంది వైద్యులు మృతి
Published: Sunday June 13, 2021

కరోనాపై పోరు అంటే ప్రాణాలతో చెలగాటమే. ఈ పోరులో ఎప్పుడూ వెనుకంజవేయలేదు వైద్యులు. మందేమిటో, చికిత్స ఏమిటో పూర్తిగా తెలియని తొలి రోజు నుంచి నేటి వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారు. ఇలా కరోనాపై పోరులో 45 మంది వైద్యులు కన్నుమూశారు. ఈ విషాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఇది వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాలు ఎన్నటికి కోలుకుంటాయో కానీ, తమ ప్రాణాలను ధారపోసి కొవిడ్ బాధితులను కాపాడిన ఘనత వారిదే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) గణాంకాల ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 45 మంది వైద్యులు కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. మొదటి వేవ్‌లో గత ఏడాది 36 మంది మరణించగా, ఈ ఏడాది ఇప్పటి దాకా 9 మంది మరణించారు. పొరుగునున్న తెలంగాణలో ఇప్పటిదాకా 36 మంది వైద్యులు మరణించినట్లు ఐఎంఏ గణాంకాలు తెలిపాయి. వైద్యుల మరణాల్లో ఏపీ ఆరో స్థానంలో ఉంది. కరోనాపై పోరులో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యుల మరణాలను లెక్కించుకునే పరిస్థితి రావడం అత్యంత విషాదకరమని వైద్యవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది మార్చిలో క రోనా వ్యాప్తి మొదలైనప్పుడు ఏం మందులు వాడాలి? ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి? పాటించాల్సిన వైద్యపరమైన జాగ్రత్తలపై స్పష్టత లేదు. ఏదో ఒక విధానం ఉండాలి కదా! అని కేంద్రం విధివిధానాలు రూపొందిస్తున్న సమయంలో కొవిడ్-19 కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.
కొవిడ్ బాధితులకు వైద్యం అందించాల్సింది వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందే. మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై అనేక విధానాలు ఉన్నా, కొవిడ్ రాకుండా అడ్డుకునే మార్గాలైతే రాలేదు. ఈ క్రమంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అత్యంత రిస్క్ అని తెలిసినా కొవిడ్ బాధితులకు చికిత్స అందించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందించారు. ఈ క్రమంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నా అనేకమంది వైద్యులు కరోనా బారినపడ్డారు. అయితే, సామాన్యుల లాగా వారికి సాధారణవైరస్ లోడ్ లేదు. ఎంతో మందికి చికిత్స అందించడంతో వారిలో వైరస్ లోడ్ 50 నుంచి 75 శాతంపైనే ఉంది. ఈ కారణంతో ఏపీలో మొదటి వేవ్‌లో 36 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మంది ప్రభుత్వ వైద్యులు, 25 మంది ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, ఒకరు జూనియర్ డాక్టర్ ఉన్నారు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి ప్రారంభమైన సెకండ్‌వేవ్‌లో వైద్యులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి వేవ్‌లో వచ్చిన సమస్యలను గుర్తించి రెండోసారి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమంలో కొందరు కరోనా బారినపడినా, ముందు జాగ్రత్త చర్యలు, తగిన మందులతో కరోనాను జయించారు. అయితే, వైర్‌సలోడ్ చాలా ఎక్కువగా ఉన్న వారు మాత్రం ప్రాణాలు వదిలారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 8 మంది వైద్యులు, ఒక జూనియర్ డాక్టర్ మరణించారు. వీరంతా ప్రభుత్వ వైద్యులే. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 36 మంది వైద్యులు మరణించారు. దేశంలో అత్యధికంగా బీహార్‌లో 111 మంది, ఢిల్లీలో 109, పశ్చిమబెంగాల్‌లో 63, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది వైద్యులు కరోనాతో మరణించినట్లు ఐఎంఏ వెల్లడించింది.

Share this on your social network: