రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్‌మెంట్ అక్కర్లేదు.

కొవిడ్ టీకా తీసుకోవడానికి ఇకపై ముందుగా రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్‌మెంట్ అక్కర్లేదు. 18 ఏళ్లు దాటిన వారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. వ్యాక్సినేటర్లు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి, టీకా వేస్తారని తెలిపింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ప్రకటన చేసింది. అంటే ఇకపై ‘వాకిన్’ విధానంలో టీకా వేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కొవిన్ పోర్టల్‌లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలను ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సమీపంలోని టీకా కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి టీకాలు ఇప్పిస్తారని వివరించింది. 1075 హెల్ప్‌లైన్ నంబరు ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపింది. ఈ పద్ధతులన్నీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసమని అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 13 నాటికి దేశవ్యాప్తంగా 24.84 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయగా.. అందులో 19.84 కోట్ల డోసులు(దాదాపు 80శాతం) అక్కడికక్కడే/వాకిన్ పద్ధతిలో వేసినవేనని వివరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం మొత్తం 69,995 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 71% గ్రామాల్లోనే ఉన్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉం డడం విశేషం. 176 గిరిజన జిల్లాల్లో 128 జిల్లాలు వ్యాక్సినేషన్‌లో ఇతర జిల్లాల కంటే మెరుగ్గా ఉన్నాయి.

Share this on your social network: