లేటరైట్ పేరుతో బాక్సైట్’ తవ్వకాలు

అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్(ఏఏఎల్) కంపెనీలో ఉత్పత్తి ప్రారంభించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అల్యూమినియం తయారీకి అవసరమైన ముడి ఖనిజం బాక్సైట్‌ను పొరుగునున్న ఒడిశా నుంచి తీసుకురావాలని యత్నిస్తోంది. దాంతోపాటు విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలోని మేలు రకం లేటరైట్ ఖనిజాన్ని కూడా తీసుకోనున్నట్టు తెలిసింది. ఒడిశా నుంచి ముడి ఖనిజం దిగుమతికి, ఉత్పత్తుల ఎగుమతికి కశింకోట మండలం బయ్యవరం నుంచి కంపెనీ వరకు రైల్వే ట్రాక్ వేయనున్నట్టు సమాచారం. మరోవైపు కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఆరుగురిని నియమించారని, వీరి కోసం కొత్తగా కార్లు కొనుగోలు చేశారని తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెన్నా సిమెంట్స్ ప్రతాపరెడ్డి ప్రధాన భాగస్వామ్యంతో విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లిలో సుమారు రూ.6 వేల కోట్లతో ఏఏఎల్‌ను ఏర్పాటుచేశారు. ఈ కంపెనీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ కైమా అనే దేశం కూడా పెట్టుబడి పెట్టి వాటాదారుగా ఒప్పందం చేసుకుంది. బాక్సైట్ కోసం అప్పట్లో ఏపీఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఏపీఎండీసీ...చింతపల్లి, గూడెంకొత్తవీధి రిజర్వు ఫారెస్టులో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వి, అన్‌రాక్ కంపెనీకి సరఫరా చేయాలి. ఈ ఒప్పందంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగడం, గిరిజనులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బాక్సైట్ తవ్వకాలకు బ్రేకులు పడి, అన్‌రాక్‌లో ఉత్పత్తి ప్రారంభం కాలేదు. కంపెనీ నిర్మాణానికి తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించే ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అటాచ్‌మెంట్ నోటీస్ ఇచ్చింది. మరోవైపు కంపెనీలో పెట్టుబడులు పెట్టిన రస్-అల్-కైమా ప్రభుత్వం నష్టపరిహారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ..: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వీలుకాని పరిస్థితి ఏర్పడడంతో అన్‌రాక్ కంపెనీ యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇతర ప్రాంతాల నుంచి ఖనిజాన్ని దిగుమతి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాలని రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా దమన్‌జోడి ప్రాంతంలో ఉన్న బాక్సైట్ గనుల కోసం ఆ రాష్ట్ర మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరిపినా, ఫలితం లేకపోయింది. ఏపీలో తమకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒడిశా నుంచి బాక్సైట్ ఖనిజాన్ని దిగుమతి చేసుకోడానికి మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ నిక్షేపాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ గిరిజనుల పేరుతో మైనింగ్ అనుమతులు పొంది, ఖనిజం తవ్వకాలు చేపట్టినా, 2018లో ఇక్కడ మైనింగ్ నిలిపివేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ పెద్దల సహకారం (బినామీలుగా)తో స్థానిక నేతలు లేటరైట్ మైనింగ్‌కు దరఖాస్తు చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఒకరు వెళ్లి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రిజర్వు ఫారెస్టులో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం కుదరదని డివిజన్ స్థాయి అధికారి ఒకరు వ్యతిరేకించినట్టు తెలిసింది. ఏదేమైనా లేటరైట్ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ వస్తుందని సదరు దరఖాస్తుదారులు చెబుతున్నారు. సరుగుడు రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోని సుందరకోట పంచాయతీ అసనగిరి, సిరిపురం గ్రామాల్లో లేటరైట్ గనులు ఉన్నాయి. అల్యూమినియం తయారీకి పీహెచ్-70 ఉన్న బాక్సైట్ వినియోగిస్తారు. అయితే సరుగుడులో లభించే లేటరైట్‌లో పీహెచ్-60 ఉందని, అందువల్ల దీనిని లో గ్రేడ్ బాక్సైట్‌గా పరిగణిస్తారని గనుల శాఖ రిటైర్డు అధికారి ఒకరు తెలిపారు. దీనిని బాక్సైట్‌గా పరిగణిస్తే వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ‘లేటరైట్’గానే చెబుతారని పేర్కొన్నారు.
సరుగుడు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు వచ్చిన వెంటనే అన్‌రాక్ కంపెనీలో ఉత్పత్తి ప్రారంభించాలని యోచిస్తున్న యాజమాన్యం...కొద్దిరోజుల నుంచి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. సరుగుడు ప్రాంతం నుంచి అన్‌రాక్ కంపెనీకి ముడి ఖనిజం రవాణా చేసే మార్గం(నాతవరం)లో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్టు సమాచారం. అలాగే, కంపెనీకి ఒడిశా నుంచి ముడిఖనిజం రవాణాకు, కంపెనీలో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించనున్నట్టు తెలిసింది. హౌరా-చెన్నై మెయిన్ లైన్‌లో కశింకోట మండలం బయ్యవరం స్టేషన్ నుంచి అన్‌రాక్ కంపెనీ వరకు రైలు మార్గం నిర్మాణం కోసం ఇటీవల ఏలేరు కాలువ వెంబడి సర్వే చేసినట్టు సమాచారం.
అన్‌రాక్ కంపెనీలో ఉత్పత్తి ప్రారంభానికి చకాచకా ఏర్పాట్లు చేస్తున్నట్టు లోపల జరుగుతున్న పరిమాణాలను బట్టి తెలుస్తోంది. వివిధ పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల క్రితం సుమారు 350 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొత్తగా 200 మంది కూలీలను తీసుకున్నారు. అల్యూమినియం పరిశ్రమలో అనుభవం ఉన్న సుమారు 150 మందిని కంపెనీలో చేర్చుకున్నట్టు సమాచారం. అలాగే, ఆరుగురు ఉన్నతస్థాయి ఉద్యోగులు నియమితులయ్యారని, వీరి కోసం కొత్తగా ఆరు కార్లు కంపెనీకి వచ్చాయని చెబుతున్నారు.

Share this on your social network: