ఇన్ఫెక్షన్‌ బయటపడని వారికీ తదనంతర ఆరోగ్య సమస్యల గండం

Published: Thursday June 17, 2021

కొవిడ్‌-19 సోకినా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడని వారు.. కోలుకున్నాక ఇక తమకేం కాదు అనే ధీమాతో ఉండటం సరికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోలుకున్న తర్వాత కూడా కనీసం రెండు,మూడు నెలల పాటు ఆరోగ్యపరమైన జాగ్రత్త చర్యలను పాటించకుంటే.. కొత్తకొత్త సమస్యలు ముసురుకునే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నరాలు, కండరాల నొప్పులు, శ్వాస సమస్యలు, హై కొలెస్టరాల్‌, నీరసం, హైబీపీ, మైగ్రెయిన్లు, జీర్ణాశయ రుగ్మతలు, చర్మ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, మానసిక కుంగుబాటు వంటివి చుట్టుముట్టొచ్చని పేర్కొన్నారు. ఫెయిర్‌ హెల్త్‌ అనే స్వచ్ఛంద సంస్థ అమెరికాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈవివరాలు వెలుగుచూశాయి.

 

ఇందులో భాగంగా గత సంవత్సరం ఇన్ఫెక్షన్‌ బారినపడిన దాదాపు 20 లక్షల మంది ఆరోగ్యబీమా నివేదికలను సేకరించి విశ్లేషించారు. దీంతో ఆ 20 లక్షల మందిలో 4.54 లక్షల మంది.. కరోనా సోకిన దాదాపు నెల, నెలన్నర రోజుల తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారని వెల్లడైంది. ఇందులో అన్ని వయస్కుల వారు, పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో తేలికపాటి లేదా మోస్తరు కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారు 27 శాతం మంది, లక్షణాలు బయటపడని ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వారు 19 శాతం మంది ఉన్నట్లు గుర్తించామని ఫెయిర్‌ హెల్త్‌ సంస్థ అధ్యక్షుడు రాబిన్‌ గెల్‌బర్డ్‌ వెల్లడించారు. ఇక మొత్తం 20 లక్షల మంది ఆరోగ్య నివేదికలను విశ్లేషించగా దాదాపు సగం (50 శాతం) మంది ఎసింప్టమాటిక్‌ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ బాధితులేనని తేలినట్లు ఆయన చెప్పారు. మిగతా 40 శాతం మందిలో కొవిడ్‌ లక్షణాలు బయటపడినప్పటికీ ఆస్పత్రుల్లో చేరాల్సినంత తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్‌ సోకలేదన్నారు. ఒక శాతం మందిలో వాసన, రుచిని కోల్పోవడం వంటి లక్షణాలు బయటపడగా, వీరిలో 5 శాతం మందే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని రాబిన్‌ వివరించారు.

 

ఎసింప్టమాటిక్‌ ఇన్ఫెక్షన్‌ బారినపడిన వారిలో ఐదో వంతు మంది దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. మొత్తం మీద కరోనా ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో 594 మంది.. పూర్తిగా కోలుకున్న నెల, నెలన్నర రోజుల తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలతో మృతిచెందారన్నారు. ఈ గణాంకాలన్నీ 2020 సంవత్సరం ఫిబ్రవరి - డిసెంబరు మధ్యకాలానికి సంబంధించినవని.. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆరోగ్య బీమా సంస్థల వద్ద నమోదైన ఆయా వ్యక్తుల ఆరోగ్య వివరాల విశ్లేషణ ఆధారంగా పై అంచనాకు వచ్చినట్లు రాబిన్‌ పేర్కొన్నారు.