కలాం పేరు మార్చి.. వైఎస్సార్‌ పేరు

Published: Monday June 21, 2021

జిల్లా కేంద్రమైన ఒంగోలులో విశ్వవిద్యాలయం, కనిగిరి నియోజకవర్గంలో ట్రిఫుల్‌ ఐటీ భవనాల నిర్మాణాలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయానికి టంగుటూరు ప్రకాశం పంతులు పేరును పెట్టారు. ట్రిపుల్‌ ఐటీకి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం అని నామకరణం చేశారు. జిల్లాకు చెందిన దివంగత టంగుటూరు ప్రకాశం పంతులు స్వాతంత్ర్యోద్యమంలో పోరాడటమేగాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండు విద్యాసంస్థలను మంజూరు చేసినా విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణ  కార్యక్రమానికి పునాది వేయలేదు. ట్రిఫుల్‌ ఐటీ తరగతులను కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించి జిల్లాలో భవనాల నిర్మాణానికి పామూరు మండలంలో ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. గత సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు. 

గత ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు పాదయాత్ర నిర్వహించిన సమయంలోనూ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ట్రిఫుల్‌ ఐటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను యూనివర్సిటీకి ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా నియమించించారు. యూనివర్సిటీ ఏర్పాటుకి అవసరమైన స్థల సేకరణ, ఇతర అంశాలను పరిశీలించాలని గత ఏడాది ప్రభుత్వం ఆదేశించింది. ట్రిఫుల్‌ ఐటీ భవనాల నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన స్థలం అనువైనది కాదంటూ కనిగిరి నియోజకవర్గంలోనే మరో స్థలాన్ని ఎంపిక చేశారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు వ్యవహారం అడుగు ముందుకు పడకపోగా ఇడుపులపాయలో జరుగుతున్న ట్రిఫుల్‌ ఐటీ తరగతులను ఒంగోలుకు మార్పించగలిగారు. 

తాజా సమాచారం మేరకు జిల్లాకు చెందిన మంత్రి సురేష్‌ అటు ట్రిపుల్‌ ఐటీ, ఇటు యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఆరంభంలోనే ఆ రెండు పూర్తి చేద్దాం.. కానీ చంద్రబాబు పాలనలో పెట్టిన పేర్లు ఉండటానికి వీల్లేదంటూ సీఎంవో నుంచి సమాచారం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా అవసరమైతే  ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుని తదనుగుణంగా సీఎంవో అధికారులు అడుగు ముందుకు వేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై సీఎంతో మంత్రి సురేష్‌ మాట్లాడారో లేదో తెలియదు కానీ ఇటీవల ఇటు విశ్వవిద్యాలయం, అటు ట్రిఫుల్‌ ఐటీ పేర్లు మార్పుకి అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. 

 

పేర్ల మార్పు అంశంపై అధికారులు దృష్టిసారించి కసరత్తు ప్రారంభించారు. టంగుటూరు ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా మార్చి ప్రజల మనోభావాలు కూడా దెబ్బతినకుండా చూడాలని మంత్రి సురేష్‌ భావించినట్లు చెప్తున్నారు. అదే విషయాన్ని ఆయన సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి తదనుగుణమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేరు మార్పుతోపాటు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఇటీవల వరకూ జిల్లా కలెక్టరుగా పని చేసి బదిలీ అయి విద్యాశాఖలో పనిచేస్తున్న పోలా భాస్కర్‌ని నియమించాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన గవర్నర్‌ ఆర్డినెన్స్‌కి ఫైలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి ఇప్పుడున్న అబ్దుల్‌ కలాం పేరు మార్చి వైఎస్సార్‌ ట్రిఫుల్‌ ఐటీగా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో విద్యాశాఖామంత్రి సురేషే ప్రత్యేక పట్టుదలతో ఉన్నారని తదనుగుణంగా ఉన్నతాధికారులతో తన అభిప్రాయాన్ని చెప్పటంతో ఆవైపు వారు దృష్టి సారించారని కొందరు అధికారుల ద్వారా తెలిసింది. ఏదిఏమైనా గత ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన రెండు ప్రతిష్ఠాత్మక సంస్థల ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం రెండేళ్లపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించటమే గాక, ఇప్పుడు మహనీయుల పేర్లుకి తిలోదకాలిచ్చే దిశగా అడుగులు వేస్తుండటం చర్చనీయాంశమైంది.