ఉద్యోగాల కోసం ఉద్యమానికి విద్యార్థి సంఘాల తీర్మానం

‘‘ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పెద్ద దగా. నిరుద్యోగ యువతకు దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఉద్యమం కొనసాగిద్దాం. ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఈ పోరాటం చేద్దాం’’ అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఇటీవల సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో అత్యంత తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు చూపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా(ఆన్‌లైన్) 13 జిల్లాల నుంచి వివిధ విద్యార్థి, యువజన సంఘాల నేతలు హాజరయ్యారు. ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి, కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయకపోతే, జగన్ దిగిపోయే వరకు కొత్త ఉద్యోగాలను భర్తీ చేయరని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో ప్రతి ఏడాదీ జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే ఈ హామీని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 30% ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, క్యాలెండర్‌లో ఆ లెక్కలు కనిపించలేదని మండిపడ్డారు. గ్రూపు ఉద్యోగాలకు 6 లక్షల మంది అభ్యర్థులు పోటీలో ఉంటే, 36 పోస్టులు మాత్రమే ప్రకటించడం దారుణమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత దారుణంగా వ్యవహరించలేదని చెప్పారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు వాటిలో కనీసం 30% ఉద్యోగాలనూ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఆరు లక్షల ఉద్యోగాలిచ్చామని కోట్లాది రూపాయల ప్రకటనలతో అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. అందులో వార్డు వలంటీర్లకు ఉద్యోగాలిచ్చామని చూపించారనీ, గతంలో వాలంటీర్లకు వేతనాలు పెంచాలంటే వారు ఉద్యోగులు కాదనీ, సేవకులుగా గుర్తించామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాల నేతలపై కేసులు పెట్టడం, భయబ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ గతంలో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలొస్తాయని, జగన్ ను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తారని, అందుకే జగన్ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని, లేని పక్షంలో నిరుద్యోగ విప్లవం వస్తుందని వ్యాఖ్యానించిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఏమైందని నిలదీశారు.
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్‌కు, వాస్తవంగా ఉన్న ఖాళీ పోస్టులకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. పాఠశాల విద్యకు సంబంధించి ఒక్క పోస్టునూ క్యాలెండర్‌లో పేర్కొనలేదన్నారు. రేషనలైజేషన్ సమయంలో రాష్ట్రంలో 16 వేల పోస్టులను బ్లాక్ చేశారని, అవన్నీ ఖాళీగా ఉన్నట్టేనని చెప్పారు. డీవైఎ్‌ఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ.. డీఎస్సీలో 25 వేలు, విద్యుత్ శాఖలో 14 వేలు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో వాటి ప్రస్తావన లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ వస్తుందన్న ఆశతో ఉన్న నిరుద్యోగులపై జగన్ నీళ్లు చల్లారని విమర్శించారు. పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు జగన్ ద్రోహం చేశారని దుయ్యబట్టారు.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు జగన్ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి, వాటిని ఓట్ల రూపంలో మల్చుకున్నారని, తీరా అధికారంలోకి జాబ్ లెస్ క్యాలెండరును విడుదల చేసి నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. ఎస్‌ఎ్‌సయూఐ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఏపీ నిరుద్యోగుల పోరాట సమితి అధ్యక్షుడు మరివేముల శ్రీనివాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ.. నూతన జాబ్ క్యాలెండరు కోసం నేటి నుంచి ప్రభుత్వంపై పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్ బాబు, తెలుగుయువత పార్లమెంటరీ అధ్యక్షులు శ్రావణ్‌కుమార్, వివి ధ నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

Share this on your social network: